గువామ్‌కు బి-2 బాంబర్లను తరలిస్తోన్న అమెరికా.. యుద్ధంలో పాల్గొంటుందా?

by Naga Rani Yarlagadda |

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel - Iran War) మరింత ఉద్ధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా కీలక చర్యలు ప్రారంభించింది.

గువామ్‌కు బి-2 బాంబర్లను తరలిస్తోన్న అమెరికా.. యుద్ధంలో పాల్గొంటుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel - Iran War) మరింత ఉద్ధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా కీలక చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో పసిఫిక్ మహాసముద్రంలోని గువామ్ దీవికి B-2 స్టెల్త్ బాంబర్లను తరలించినట్లు ఇద్దరు అమెరికా అధికారులు రాయిటర్స్‌కి తెలిపారు. అయితే ఇది మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలకు సంబంధించిన చర్యేనా లేదా అన్నది ఇంకా స్పష్టంగా చెప్పలేదని వారు పేర్కొన్నారు.

B-2 బాంబర్లు 30,000 పౌండ్ల బరువుతో ఉండే GBU-57 Massive Ordnance Penetratorను మోసేందుకు రూపొందించబడ్డాయి. ఇది భూమిలో లోతుగా ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయడంలో ఉపయోగపడే అతి శక్తివంతమైన బాంబుగా పరిగణించబడుతోంది. విశ్లేషకుల ప్రకారం.. ఈ బాంబును ఇరాన్ అణు కేంద్రాలపై, ముఖ్యంగా ఫోర్దో వంటి బంకర్లపై దాడులకు ఉపయోగించవచ్చని అభిప్రాయపడ్డారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు గువామ్‌కి బాంబర్లు తరలించడం తప్ప, మరింత ముందుకు తరలించేందుకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ఎన్ని బాంబర్లు తరలించబడ్డాయన్న వివరాలను వారు వెల్లడించలేదు. అమెరికా రక్షణ శాఖ (Pentagon) ఈ విషయంపై స్పందించలేదు.

డియాగో గార్సియా కేంద్రంగా మారుతుందా?

ఈ B-2 బాంబర్లు మిడిల్ ఈస్ట్‌కు మరింత సమీపంగా ఉన్న ఇండియన్ ఓషన్‌లోని డియాగో గార్సియా ద్వీపంలోని అమెరికా-బ్రిటిష్ సైనిక స్థావరానికి తరలించబడ్డాయా అన్న విషయాన్ని విశ్లేషకులు, అధికారులు గమనిస్తున్నారు. గత నెల వరకు అక్కడ B-2 బాంబర్లే ఉన్నా, ప్రస్తుతం అవి B-52 బాంబర్లతో మార్చారు.

ట్రంప్ నిర్ణయం కోసం వేచిచూస్తున్న ప్రపంచం

ఇజ్రాయెల్ ఇప్పటికే ఒక అనుభవజ్ఞులైన ఇరానియన్ కమాండర్‌ను హతమార్చినట్లు ప్రకటించగా.. ఇరాన్ తమ అణు ప్రోగ్రామ్‌పై ఎలాంటి బెదిరింపుల మధ్య చర్చలు జరపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ అనుసరించిన ప్రకారం.. ఇరాన్ అణు ఆయుధాల అభివృద్ధి దశలో ఉందని ఆరోపిస్తుండగా.. తాము శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమం చేపట్టామని ఇరాన్ చెబుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల సమయం తీసుకుంటానని తెలిపారు. "ప్రజలు వివేకంతో స్పందించారా లేదా అనేది చూడాలనుకుంటున్నాను" అని ఆయన అన్నారు. ఇటీవలే అమెరికా యూరప్‌లోకి భారీ సంఖ్యలో ట్యాంకర్ విమానాలను తరలించడంతో పాటు, మిడిల్ ఈస్ట్‌లోకి ఫైటర్ జెట్లను కూడా పంపింది. ఇప్పుడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కూడా మిడిల్ ఈస్ట్ వైపు కదులుతోంది.

Next Story