Us army: యూఎస్ ఆర్మీలో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం.. ట్రంప్ ఆదేశాల మేరకు చర్యలు

by B.Srinivas |

సైన్యంలో ఇకపై ట్రాన్స్‌జెండర్లను నియమించబోమని అమెరికా మిలిటరీ ప్రకటించింది. దీనిని నిషేధిస్తూ ట్రంప్ ఉత్తర్వుపై ఇటీవల సంతకం చేశారు.

Us army: యూఎస్ ఆర్మీలో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం.. ట్రంప్ ఆదేశాల మేరకు చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సైన్యంలో ఇకపై ట్రాన్స్‌జెండర్ల (Trans genders)ను నియమించబోమని అమెరికా మిలిటరీ ప్రకటించింది. ఆర్మీలో ట్రాన్స్ జెండర్లను నిషేధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఇటీవల సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘యూఎస్ ఆర్మీ ఇకపై ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను సైన్యంలో చేరడానికి అనుమతించబోదు. సైనిక సభ్యులకు లింగ మార్పిడి విధానాలను నిర్వహించడం, సులభతరం చేయడం కూడా ఆపివేస్తుంది’ అని తెలిపింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే జెండర్ డిస్ఫోరియా ఉన్న వ్యక్తులు దేశానికి సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వారిని గౌరవంగా చూస్తామని వెల్లడించింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న వారు లింగమార్పిడి చేయించుకోవడానికి సంబంధించిన ప్రక్రియలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది.

గత 27న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆర్మీలో ట్రాన్స్ జెండర్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సైన్యంలో ట్రాన్స్‌జెండర్ సైనికులు ఉండటం వల్ల వారి సంసిద్ధత, సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపారు. ఒక వ్యక్తి పుట్టుకతో కేటాయించిన జెండర్‌తో కాకుండా వేరే జెండర్‌తో గుర్తించడం సైనిక క్రమశిక్షణ, సమగ్రత, గౌరవప్రదమైన జీవితానికి విరుద్ధమని పేర్కొన్నారు. అందుకే సైన్యంలో ట్రాన్స్‌జెండర్ విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే యూఎస్ ఆర్మీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. కాగా, దేశ సైన్యంలో ట్రాన్స్ వ్యక్తులను చేర్చుకోవడంపై ఇప్పటికే నిషేధం ఉన్నప్పటికీ, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barak Obama) 2016లో ఆ నిబంధనను తొలగించారు. దీంతో తాజాగా ట్రంప్ మళ్లీ బ్యాన్ విధించారు.

Next Story