- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రవాద చర్యే.. ఢిల్లీ పేలుడుపై కేంద్ర కేబినెట్ తీర్మానం
ఢిల్లీ పేలుడును ఉగ్రవాద చర్యగా పేర్కొంటూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ దాడి వెనుక ఉన్న వారందర్నీ శిక్షిస్తామని పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై బుధవారం నాడు సమావేశమైన కేబినెట్.. పేలుడులో మరణించిన వారి కోసం రెండు నిమిషాల మౌనం పాటించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీ పేలుడులో మరణాలపై ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తీర్మానం చేశారు. సమావేశం అనంతరం కేబినెట్ తీర్మానాన్ని వివరించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ‘నవంబరు 10న ఎర్రకోట వద్ద కారు పేలుడు జరిగింది. కొందరు దేశద్రోహులు చేసిన ఈ ఘోరమైన ఉగ్రవాద చర్యను దేశమంతా చూసింది’ అని చెప్పారు. ఈ దాడిలో మరణించిన వారికి కేబినెట్ సంతాపం తెలియజేసింది. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. అదే సమయంలో బాధితులను కాపాడేందుకు తక్షణమే రంగంలోకి దిగి సహాయసహకారాలు అందించిన ఎమర్జెన్సీ రెస్పాండర్స్, మెడికల్ సిబ్బంది కృషిని అభినందించింది.
ఈ పేలుడును ‘ఒక దారుణమైన పిరికిచర్య’గా అభివర్ణించిన కేబినెట్.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై ఏమాత్రం సహనం చూపబోమనే జీరో-టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని పునరుద్ఘాటించింది. ఈ పేలుడు విషయంలో ప్రపంచంలోని పలుదేశాల నుంచి వచ్చిన సానుభూతి, మద్దతును గుర్తించింది. సంక్షోభ సమయంలో ధైర్యంగా, సమన్వయంతో పనిచేసిన భద్రతా దళాలు, అధికారులు, ప్రజలను అభినందించింది. ఈ దాడి వెనుక కారణాలను సాధ్యమైనంత వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించిన కేంద్ర కేబినెట్.. ప్రస్తుతానికి పరిస్థితిని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ దాడి చేసిన వాళ్లు, వారి సహాయకులు, స్పాన్సర్లు, మద్దతుదారులను గుర్తించి, శిక్షిస్తామని పేర్కొంది. దేశ భద్రతకు, ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టంచేసింది.






