Ukraine: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగియనుందా?

by Shamantha N |

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కీలక పరిణామం జరిగింది. ఉక్రెయిన్ తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు.

Ukraine: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగియనుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కీలక పరిణామం జరిగింది. ఉక్రెయిన్ తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. కాగా.. పుతిన్ ప్రకటన వచ్చిన కొద్దిసేపటితే.. రష్యాతో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. అయితే, ఇస్తాంబుల్‌ వేదికగా చర్చలకు పుతిన్‌ ఆహ్వానాన్ని నేరుగా ఆయన ప్రస్తావించలేదు. ‘‘ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోంది’’ అని పేర్కొన్నారు. యుద్ధం ముగింపులో తొలి అడుగు కాల్పుల విరమణ. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. ఈ మారణకాండను ఇంకా కొనసాగించడంలో అర్థం లేదు. రష్యా కాల్పుల విరమణ ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నాం. రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

పుతిన్ ఏమన్నారంటే?

మరోవైపు, సోమవారం నుంచి మొదలయ్యే 30 రోజుల కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘిస్తే.. మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ సహా పలువురు ఐరోపా నాయకులు వెల్లడించారు. ఇకపోతే, కీవ్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. గురువారం ఇస్తాంబుల్‌ వేదికగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధికారులను పుతిన్‌ కోరారు. ఈ విషయంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మాట్లాడతానని అన్నారు. ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని, ఈస్టర్ కాల్పుల విరమణ, ‘విక్టరీ డే’ కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని చెప్పారు. అయినప్పటికీ ఆ సమయాల్లో ఉక్రెయిన్‌ ఈ ఒప్పందాలను ఉల్లంఘించి.. 524 వైమానిక డ్రోన్‌లు, 45 సముద్ర డ్రోన్‌లు, అనేక పాశ్చాత్య క్షిపణులతో రష్యాపై దాడి చేసిందని ఆరోపించారు. తమ సైన్యం కీవ్ దాడులను తిప్పి కొట్టిందని తెలిపారు.

Next Story