Pulitzer Prize: ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక ‘పులిట్జర్’

by Ramesh Naini |

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్‌ పురస్కారాలు ఈ ఏడాది ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించాయి.

Pulitzer Prize: ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక ‘పులిట్జర్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్‌ (Pulitzer Prize) పురస్కారాలు ఈ ఏడాది ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించాయి. డిజిటల్ నిఘా, పెరుగుతున్న సైబర్ మోసాలను విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు గాను ప్రముఖ జర్నలిస్టులు ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ‘ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ’ విభాగంలో వీరు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) మీడియా సంస్థకు చేసిన ఈ రిపోర్టింగ్ ప్రాజెక్టుకు గాను.. మరో జర్నలిస్ట్ నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఆనంద్, సుపర్ణ ఈ అవార్డును పంచుకోనున్నారు.

పులిట్జర్ ప్రాముఖ్యత..

ఈ పులిట్జర్ పురస్కారాలను అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ (గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం) పర్యవేక్షిస్తుంది. జర్నలిజం, సాహిత్యం, సంగీతం తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అత్యున్నత గౌరవంగా దీనిని పరిగణిస్తారు.

ఎవరీ ఆనంద్ ఆర్కే?

ఆనంద్ ఆర్కే ముంబైకి చెందిన ప్రముఖ ఇలస్ట్రేటర్, విజువల్ ఆర్టిస్ట్. 2011లో ప్రతిష్టాత్మక ‘సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’ నుంచి పట్టభద్రుడైన ఆయనకు ఎన్నో అంతర్జాతీయ సంస్థలతో పనిచేసిన అనుభవం ఉంది. ఇమేజ్ కామిక్స్ ప్రచురించిన ‘బ్లూ ఇన్ గ్రీన్’ (Blue in Green) గ్రాఫిక్ నవల కోసం కలరిస్ట్ జాన్ పియర్సన్‌తో కలిసి 2021లో బెస్ట్ పెయింటర్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ‘ఐస్నర్ అవార్డు’ను గెలుచుకున్నారు. డార్క్ హార్స్ కామిక్స్ (గ్రాఫిటీస్ వాల్), డీసీ కామిక్స్ (రిజరెక్షన్ మ్యాన్) వంటి ప్రఖ్యాత సంస్థలకు పనిచేశారు. బూమ్! స్టూడియోస్, 2000AD వంటి పబ్లిషర్స్‌కు కవర్ ఆర్ట్ రూపొందించారు. హ్యుందాయ్, ఇండియన్ నేవీ వంటి క్లయింట్‌లతో కూడా ఆయన పనిచేశారు.

సుపర్ణా శర్మ నేపథ్యం..

సుపర్ణా శర్మ దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, అలాగే ఎడిటర్. నేరాలు, వివాదాలు, విపత్తులు, అవినీతి తదితర అంశాలపై ఎన్నో లోతైన కథనాలు రాశారు. 2023లో ఢిల్లీలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ‘అల్ జజీరా’ (Al Jazeera) వార్తా సంస్థ కోసం ఆమె చేసిన పరిశోధన ఎంతో పేరు తెచ్చిపెట్టింది. వృద్ధుల సంరక్షణ రంగంలో ఉన్న నిర్లక్ష్యాన్ని, అలాగే వాస్తవాలను దాచి పెట్టేందుకు జరిగిన ప్రయత్నాలను ఆమె తన కథనం ద్వారా బట్టబయలు చేశారు.

Next Story