Mark Carney: విభేదాలు సృష్టించి.. విచ్ఛిన్నం చేసి.. ట్రంప్ పై కెనడా ప్రధాని వ్యాఖ్యలు

by Shamantha N |

కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్‌ పార్టీ గెలుపు ఖరారైంది. నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ (Mark Carney) మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Mark Carney: విభేదాలు సృష్టించి.. విచ్ఛిన్నం చేసి.. ట్రంప్ పై కెనడా ప్రధాని వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ఎన్నికల్లో అధికార లిబరల్‌ పార్టీ గెలుపు ఖరారైంది. నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ (Mark Carney) మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల్లో విభేదాలు సృష్టించి, విచ్ఛిన్నం చేసి కెనడాను సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Trump) ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా సుంకాలు, విలీనానికి సంబంధించిన బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు చరిత్రలో కీలకమైన క్షణం ఉందని.. ఇకపై అమెరికాతో పాత అనుబంధం ముగిసిందన్నారు. స్థిరమైన మిత్రదేశంగా అగ్రరాజ్యాన్ని చూడలేమన్నారు. ట్రంప్‌ మొదలుపెట్టిన వాణిజ్యయుద్ధంలో అగ్రదేశంపై తాము గెలుస్తామని కార్నీ ప్రజలకు హామీ ఇచ్చారు. అమెరికా తమకు చేస్తున్న ద్రోహాన్ని ఎన్నటికీ మరిచిపోవ్దని.. దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కెనడా అనుసరిస్తున్న ఐక్యత, అభివృద్ధి, స్థితిస్థాపకత వంటి విలువలను తాను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి కొన్ని నెలలు సవాలుగా ఉండొచ్చని.. అయినప్పటికీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కెనడా గతంలో కంటే బలంగా పుంజుకుంటుందని అన్నారు. అంతేకాకుండా, ఎన్నికల్లో తమకు గట్టి పోటీ ఇచ్చినందుకు ప్రతిపక్ష నాయకుడు పోయిలివ్రేను కార్నీ అభినందించారు. దేశ అభివృద్ధి విషయంలో తామందరం ఒకేలా ఆలోచిస్తామని తెలిపారు.

గెలుపు దిశగా లిబరల్స్

343 మంది సభ్యులున్న కెనడా పార్లమెంటులో లిబరల్స్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. అయితే మైనారిటీగా పాలన కొనసాగించడానికి ఇది సరిపోతుంది. మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీకి 172 సీట్లు అవసరం. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. లిబరల్‌ పార్టీ 145 స్థానాల్లో గెలుపొందగా.. మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, కన్జర్వేటివ్‌ పార్టీ 134 స్థానాలు దక్కించుకొని.. మరో 13 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఫ్రాంకోయిస్‌ బ్లాంకెట్ నేతృత్వంలోని బ్లాక్‌ క్యూబికాయిస్‌ పార్టీ 22 స్థానాల్లో గెలిచి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఖలిస్థానీ అనుకూలుడైన జగ్మీత్‌ సింగ్‌ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్‌ పార్టీ నాలుగు స్థానాలు గెలిచి.. మరో 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారు.

Next Story