Trump: రూటు మార్చిన ట్రంప్.. రష్యాపై దాడులు పెంచాలని పిలుపు

by B.Srinivas |   (  Updated:2025-07-15 16:27:39  IST  )

రష్యాపై మరింత లోతుగా దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీని కోరినట్టు తెలుస్తోంది.

Trump: రూటు మార్చిన ట్రంప్.. రష్యాపై దాడులు పెంచాలని పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాపై మరింత లోతుగా దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ (Zelensky) ని కోరినట్టు తెలుస్తోంది. అమెరికా దీర్ఘశ్రేణి ఆయుధాలను అందిస్తే రష్యా రాజధాని మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై ఉక్రెయిన్ దాడి చేయగలదా అని అడిగినట్టు సమాచారం. జూలై 4న ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సందర్భంగా ట్రంప్ ఈ వాదన చేసినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపింది. ట్రంప్ ప్రశ్నకు జెలెన్ స్కీ స్పందిస్తూ మీరు ఆయుధాలు అందిస్తే తప్పకుండా దాడి చేయగలమని చెప్పినట్టు పేర్కొంది. పుతిన్‌తో ట్రంప్ మాట్లాడిన మరుసటి రోజే ఇద్దరి నాయకుల మధ్య రెచ్చగొట్టు సంభాషణ జరిగినట్టు వెల్లడించింది. అయితే మాస్కోపై దాడి చేయడానికి ఉపయోగించే దీర్ఘ-శ్రేణి ఆయుధాలను అమెరికా ఉక్రెయిన్‌కు ఇస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. పుతిన్ తీరుపై ఇటీవల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా నివేదిక సంచలనంగా మారింది.

కాగా, ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని తెలిపారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని తగ్గించాడు. పుతిన్ తోనూ దౌత్య ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదు. దీంతో ట్రంప్ నిరాశలో ఉన్నాడని ఈ నేపథ్యంలోనే దాడులను ప్రోత్సహిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

Next Story