క్రిప్టో దెబ్బకు కుదేలైన ట్రంప్ మీడియా.. ‘ట్రూత్ సోషల్’కు 400 మిలియన్ డాలర్ల నష్టం!

by Ramesh Naini |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ మాతృ సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది.

క్రిప్టో దెబ్బకు కుదేలైన ట్రంప్ మీడియా.. ‘ట్రూత్ సోషల్’కు 400 మిలియన్ డాలర్ల నష్టం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ మాతృ సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) భారీ నష్టాలను చవిచూసింది. క్రిప్టోకరెన్సీ విలువల పతనం కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సంస్థ సుమారు 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,300 కోట్లు) నికర నష్టాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది.

ఆదాయం నామమాత్రం.. ట్రంప్ వాటా 41 శాతం

కంపెనీ ఫైలింగ్ ప్రకారం, మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి (తొలి త్రైమాసికం) గాను సంస్థ కేవలం 9 లక్షల డాలర్ల (1 మిలియన్ డాలర్ల కంటే తక్కువ) ఆదాయాన్ని మాత్రమే ఆర్జించింది. స్టాక్ మార్కెట్లో 2.47 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఒక కంపెనీకి ఇది చాలా నామమాత్రపు ఆదాయం. కాగా, ఈ TMTG సంస్థలో డొనాల్డ్ ట్రంప్‌నకు సుమారు 41 శాతం వాటాలు ఉన్నాయి. ఆయన అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్‌లో ఈ షేర్లు ఉన్నాయి. ట్రంప్ తన అధికారిక ప్రకటనల కోసం క్రమం తప్పకుండా ‘ట్రూత్ సోషల్’ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

నష్టాలకు ప్రధాన కారణం..!

సోషల్ మీడియాతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కూడా చురుకుగా ఉన్న TMTG, ట్రంప్‌నకు ఎంతో ఆసక్తి ఉన్న క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పెట్టేందుకు ఏడాది క్రితం 2.5 బిలియన్ డాలర్ల నిధులను ప్రకటించింది. అయితే, డిజిటల్ కరెన్సీల మార్కెట్ కుప్పకూలడం ఈ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. అక్టోబర్‌ ప్రారంభంలో ఏకంగా 1,26,000 డాలర్లకు పైగా ఉన్న బిట్‌కాయిన్ ధర, మార్చి నాటికి 70,000 డాలర్ల దిగువకు పడిపోయినట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం. ప్రస్తుతం ఇది 80,000 డాలర్లకు పైగా కోలుకున్నప్పటికీ, పెట్టుబడులను విక్రయించకపోయినా వాటి ప్రస్తుత మార్కెట్ విలువను ఫైలింగ్‌లో వెల్లడించాలన్న నిబంధనల కారణంగా సంస్థ పేపర్ లాస్‌ను చూపించాల్సి వచ్చింది. దీంతో తొలి త్రైమాసికంలో రికార్డ్ చేసిన 406 మిలియన్ డాలర్ల నష్టంలో సింహభాగం డిజిటల్ ఆస్తుల వల్లేనని కంపెనీ స్పష్టం చేసింది.

Next Story