- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: నాడు ఇందిర.. నేడు మోదీ: దేశం కోసం ‘బంగారం’ త్యాగం తప్పదా?
బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ దేశ ఆర్థిక వ్యవస్థను ముంచేస్తోందా అంటే ఔననే సమాధానమే వస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: చరిత్ర పునరావృతమవుతుందన్న మాట అక్షర సత్యమైంది. కాలం మారుతుంది, నాయకులు మారుతారు.. కానీ, దేశ ఆర్థిక భద్రత విషయంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు చరిత్రను గుర్తుకు తెస్తుంటాయి. సరిగ్గా 59 ఏళ్ల క్రితం నాటి ‘ది హిందూ’ పత్రిక క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. అందుకు కారణం.. నాడు ప్రధాని ఇందిరాగాంధీ, నేడు పీఎం నరేంద్ర మోదీ భారతీయులకు చేసిన ఒకే రకమైన విన్నపమే.
నాడు ఇందిర ‘గోల్డ్ కంట్రోల్ ఆర్డర్’..
1967 జూన్ 6న వెలువడిన ‘ది హిందూ’ వార్తా పత్రికలో ఇందిరాగాంధీ చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. భారత్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడానికి బంగారం దిగుమతులను తగ్గించడమే మార్గమని ఆమె భావించారు. అందుకే, ఆభరణాల రూపంలో కూడా బంగారం కొనవద్దని ప్రజలను కోరుతూ, దానికి అనుగుణంగా ‘గోల్డ్ కంట్రోల్ ఆర్డర్’ (Gold Control Order)ను అమల్లోకి తెచ్చారు.
నేడు మోదీ బహిరంగ విజ్ఞప్తి..
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతుండటం, అంతర్జాతీయ యుద్ధాల వల్ల డాలర్ నిల్వలపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి చేశారు. వివాహాల వంటి శుభకార్యాలకు కూడా కనీసం ఏడాది పాటు విదేశీ బంగారం కొనుగోలును వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ‘మనం ఎంత ఎక్కువగా బంగారం కొంటే, అంత ఎక్కువగా మన విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మోదీ పిలుపునిచ్చారు.
బంగారంపై భారతీయులకున్న మక్కువ సామాన్యమైనది కాదు. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత సెంటిమెంట్ల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని నాడు ఇందిర చెప్పారు. నేడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మోదీ అడుగులు వేస్తున్నారు. కాలం మారినా, దేశం పట్ల ప్రజలు చూపే క్రమశిక్షణే భారత ఆర్థిక శక్తిని కాపాడుతుందని ఈ రెండు ఘటనలు నిరూపిస్తున్నాయి.






