- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CJI: హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ సమానమే: సీజేఐ బీఆర్ గవాయ్
రాజ్యాంగం ప్రకారం రెండూ సమాన రాజ్యాంగ న్యాయస్థానాలని అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: హైకోర్టు కంటే సుప్రీంకోర్టు ఉన్నతమైనది కాదు, అలాగని తక్కువ కూడా కాదని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. శుక్రవారం భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. రాజ్యాంగం ప్రకారం రెండూ సమాన రాజ్యాంగ న్యాయస్థానాలని అన్నారు. ఇదే సమయంలో ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఓ ప్రతిపాదన చేశారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తుల పదవికి పరిగణించేలా చూడాలని అన్నారు. సదరు న్యాయవాదులు హైకోర్టులో ప్రాక్టీస్ చేయకపోయినా సరే, వారిని న్యాయమూర్తుల పదవి ఇచ్చేలా చూడాలన్నారు. ఇందుకు స్పందించిన సీజేఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ ఒకటే. కాబట్టి ఓ న్యాయమూర్తి పదవికి నిర్దిష్ట వ్యక్తి పేరును సిఫార్సు చేయాలని హైకోర్టు కొలీజియంను, సుప్రీంకోర్టు కొలీజియం ఆదేశాలివ్వలేదు.
హైకోర్టు కొలీజియమే దీనిపై ముందుగా నిర్ణయం తీసుకోవాలి. వారు సిఫార్సు చేసిన పేర్లనే సుప్రీంకోర్టు కొలీజియం పరిగణలోకి తీసుకుంది. జాబితాలో అర్హులైన వారి పేర్లను సూచించాలని చెబుతాం. వారు పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి పదవికి అర్హత ఉన్న వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపిస్తారు. మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా హయాంలో సుప్రీంకోర్టు కొలీజియం అభ్యర్థులతో నేరుగా సంభాషించే విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల అనేక సానుకూల ఫలితాలు వచ్చాయి. అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత న్యాయమూర్తి పదవికి ఎవరు అర్హులనే విషయం తెలుసుకోవడం, వారి వల్ల సమాజానికి ఉన్న మేలును అంచనా వేయడం సాధ్యమయ్యిందని బీఆర్ గవాయ్ వివరించారు.
ఈ సందర్భంగా.. జస్టిస్ గవాయ్ 1855 నాటి ఝార్ఖండ్‌లొని సంతాల్ తిరుగుబాటు, 1857 తిరుగుబాటు, రాణి లక్ష్మీబాయి, బిర్సా ముండా, జలియన్ వాలాబాగ్ ఊచకోత మరియు చంపారన్ సత్యాగ్రహం వంటి చారిత్రాత్మక పోరాటాల గురించి మాట్లాడారు. 19వ శతాబ్దంలో అణగారిన వర్గాల బాలికలకు విద్య కోసం పోరాడిన జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి సంస్కర్తలకు ఆయన నివాళులర్పించారు. మహాత్మగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బీఆర్ అంబేడ్కర్ మాటలను ప్రస్తావించారు. దేశ స్వతంత్ర పోరాటంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.






