టీఎంసీ బెంగాల్‌ను ఎదగనివ్వట్లేదు: ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు

by Dishanational2 |
టీఎంసీ బెంగాల్‌ను ఎదగనివ్వట్లేదు: ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. టీఎంసీ బెంగాల్ ప్రజలను ఎదగనివ్వట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలను పేదలుగానే ఉంచారని టీఎంసీ కోరుకుంటుందని విమర్శించారు. తద్వారా రాజకీయాలు చేయాలని చూస్తుందని తెలిపారు. బెంగాల్ పర్యటనలో ఉన్న మోడీ శనివారం నదియా జిల్లాలోని కృష్ణా నగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. రాష్ట్రాన్ని త్వరలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. బెంగాల్‌లోని 42 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఎన్డీయే 400 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని స్పష్టం చేశారు.

అవినీతి, బంధుప్రీతి పెరిగింది

బెంగాల్‌లో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని, ఎప్పుడు లొంగిపోవాలో, ఎప్పుడు అరెస్టు చేయాలో అనే విషయం నేరస్తులే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయిందని, తద్వారా అభివృద్ధికి అడ్డుకట్టపడుతోందని వెల్లడించారు. సందేశ్ ఖాతీ నేరస్తులను అరెస్టు చేయాలనే ఉద్దేశం టీఎంసీ ప్రభుత్వానికి లేదని, కానీ బీజేపీ నాయకులు, ఆ ప్రాంత మహిళలు నిలదీయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ.940 కోట్ల కంటే ఎక్కువ విలువైన నాలుగు రైలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇవి దామోదర్-మొహిశిలా లైన్ డబ్లింగ్, రాంపూర్‌హాట్, మురారై మధ్య మూడో లైన్, బజార్‌సౌ-అజిమ్‌గంజ్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం, అజిమ్‌గంజ్‌-ముర్షిదాబాద్‌లను కలుపుతూ కొత్త లైన్ అని అధికారులు తెలిపారు. అంతేగాక నాడియా జిల్లాలోని కళ్యాణిలో నిర్మించిన ఎయిమ్స్‌ను సైతం ప్రధాని ప్రారంభించారు.


Next Story

Most Viewed