సార్ ప్లీజ్.. మమ్మల్ని కాపాడండి.. దొంగతనానికి వెళ్లి పోలీసులకు ఫోన్!

by Naga Rani Yarlagadda |

దొంగతనానికి వెళ్లిన దొంగలే చివరికి పోలీసులకు ఫోన్ చేసి ‘మమ్మల్ని కాపాడండి’ అని వేడుకున్న వింత ఘటన ఒడిశాలోని బసంతి కాలనీలో చోటుచేసుకుంది.

సార్ ప్లీజ్.. మమ్మల్ని కాపాడండి.. దొంగతనానికి వెళ్లి పోలీసులకు ఫోన్!
X

దిశ, వెబ్‌డెస్క్: దొంగతనానికి వెళ్లిన దొంగలే చివరికి పోలీసులకు ఫోన్ చేసి ‘మమ్మల్ని కాపాడండి’ అని వేడుకున్న వింత ఘటన ఒడిశాలోని బసంతి కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఆశ్చర్యకర ఘటన ఏప్రిల్ 29 రాత్రి జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఇద్దరు దొంగలు ఓ ఇంట్లోనే చిక్కుకుపోయారు. బయటకు వస్తే ప్రజల చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుందనే భయంతో చివరికి అత్యవసర పోలీసు హెల్ప్‌లైన్ 112కు కాల్ చేసి తమను రక్షించాలని కోరారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానక్ సింగ్ (30), సత్యేంద్ర కుమార్ సింగ్ (32) అనే ఇద్దరు వ్యక్తులు ఓ రెండంతస్తుల ఇంటి గేటు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంటి యజమాని, అద్దెదారులు ఇద్దరూ బయటకు వెళ్లి ఉండటంతో ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లోని బీరువా పగులగొట్టి బంగారం, వెండి నగలను అపహరించారు. అయితే పక్కింట్లో టీవీ చూస్తున్న ఓ వృద్ధురాలికి అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో వెంటనే స్థానికులను అప్రమత్తం చేసింది. క్షణాల్లోనే కాలనీవాసులు అక్కడికి చేరుకుని ఇంటి ప్రధాన గేటుతో పాటు పైకప్పు మార్గాన్ని కూడా మూసివేసి దొంగలను లోపలే బంధించారు. దీంతో బయటకు వచ్చే వీలు లేకుండా పోయింది.

స్థానికుల ఆగ్రహం చూసి భయపడిన దొంగలు.. ప్రజలు తమపై దాడి చేసే అవకాశముందని గ్రహించి.. వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ‘మమ్మల్ని కాపాడండి’ అని పోలీసులను వేడుకున్నారు. అంతేకాదు తమ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకుని, ఆగ్రహంతో ఉన్న ప్రజల మధ్య నుంచి ఇద్దరు దొంగలను రక్షించి స్టేషన్‌కు తరలించారు. విచారణలో వారు దొంగతనం చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. అయితే భయంతో దొంగిలించిన నగలను ఇంట్లోనే వదిలేశామని చెప్పారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారగా.. “దొంగలే పోలీసులకు ఫోన్ చేసి కాపాడమని అడగడం ఇదే మొదటిసారి చూసాం” అంటూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Next Story