‘పెళ్లి వద్దంటే ఇంట్లో వాళ్లు బాధపడతారని..’ కేతన్ అగర్వాల్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు

by Ramesh Naini |

పూణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది.

‘పెళ్లి వద్దంటే ఇంట్లో వాళ్లు బాధపడతారని..’ కేతన్ అగర్వాల్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పూణెకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరిల వ్యవహారంపై పోలీసుల విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా.. ఆ విషయం ఇంట్లో చెబితే కుటుంబ సభ్యులు బాధపడతారని భావించినట్లు ఆమె పోలీసుల విచారణలో తెలిపింది.

క్రికెట్ మైదానంలో పరిచయం.. దీపావళికి స్నేహం

సియా, చేతన్‌లకు అసలు ఎలా పరిచయం ఏర్పడిందనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. సియా సోదరుడు సాహిల్ గోయల్ ద్వారానే చేతన్ ఆమెకు పరిచయమయ్యాడు. సాహిల్, చేతన్ ఇద్దరూ కలిసి తరచూ క్రికెట్ ఆడేవారు. సోదరుడితో పాటు క్రికెట్ గ్రౌండ్‌కు వెళ్లే సియాకు అక్కడే చేతన్‌తో తొలి పరిచయం ఏర్పడింది. అనంతరం 2025 దీపావళి పండుగ సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం విపరీతంగా పెరిగినట్లు పోలీసులు గుర్తించారు.

238 గంటల పాటు ఫోన్ సంభాషణలు..

వీరిద్దరి కాల్ డేటా రికార్డులను (CDR) పరిశీలించిన పోలీసులకు విస్మయం కలిగించే అంశాలు దొరికాయి. ఈ ఏడాది జనవరి నుంచి సియా, చేతన్‌ల మధ్య ఏకంగా 2,004 సార్లు ఫోన్ కాల్స్ జరిగాయి. వీరు దాదాపు 238 గంటల పాటు ఫోన్లో మాట్లాడుకున్నట్లు డేటా ద్వారా స్పష్టమైంది.

హత్యకు ముందు కేఫ్‌లో భేటీ.. ఆధారాల మాయం

కేతన్ అగర్వాల్ మరణానికి సరిగ్గా ఒకరోజు ముందు, అంటే జూన్ 17న సియా, చేతన్ పూణెలోని లుల్లానగర్ ప్రాంతంలో ఉన్న ఓ కేఫ్‌లో కలుసుకున్నారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు సుమారు గంటపాటు అక్కడే గడిపారు. ఈ భేటీలోనే హత్యకు సంబంధించిన తుది ప్రణాళిక రచించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, లోహగడ్ కోట వద్ద జరిగిన ఈ ఘటనకు ముందు, ఆ తర్వాత నిందితులిద్దరూ తమ మొబైల్ ఫోన్ల నుంచి డిజిటల్ ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేశారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లను పూర్తిగా తొలగించడమే కాకుండా, రీసైకిల్ బిన్‌ను కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతం ఈ మొబైల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి, డిలీట్ అయిన డేటాను తిరిగి వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సోదరుడికి 10 గంటల పాటు పోలీసుల ప్రశ్నలు

చేతన్‌తో సియాకు ఉన్న సంబంధం, అతనితో తనకున్న పరిచయం తదితర వివరాలపై సియా సోదరుడు సాహిల్ గోయల్‌ను స్థానిక పోలీసులు శుక్రవారం దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం విచారణకు పిలిపించి, రాత్రికి ఇంటికి పంపించారు. కేసు దర్యాప్తులో భాగంగా సియా కుటుంబానికి చెందిన మరికొందరు బంధువుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Next Story