పొరుగున కరోనా టెర్రర్.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

by Disha Web Desk 2 |
పొరుగున కరోనా టెర్రర్.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పొరుగు దేశం చైనాలో కరోనా వైరస్ మరోసారి టెర్రర్ పుట్టిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. చైనాలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజాగా పలు సూచనలు చేసింది. చైనాను వణికిస్తున్న బీఎఫ్-7 వేరియంట్ కేసులు భారత దేశంలోనూ నమోదైన కారణంగా భవిష్యత్‌లో ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం లేఖను రాసింది. కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు వైద్య మౌళిక సదుపాయాల నిర్వహణ ముఖ్యమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని లేఖలో పేర్కొన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు పీఎస్ఏ ప్లాంట్లు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయో లేదో సాధారణ మాక్ డ్రిల్ నిర్వహించాలని, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) లభ్యత మరియు వాటి రీఫిల్లింగ్ కోసం నిరంతరాయ సరఫరా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వెంటిలేటర్ల లభ్యతతో పాటు వాటి ఎక్విక్ మెంట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి:

దేశంలో బీఎఫ్.7 వేరియంట్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా టెస్టులు తప్పని సరి చేస్తున్నట్టు కేంద్రఆర్యోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. మొత్తం విమానంలోని ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేస్తుండగా చైనా, జపాన్, దక్షిణ కోరియా, హాంగాంగ్, థాయ్ లాంట్ దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులకు మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని చేసినట్టు మంత్రి శనివారం తెలిపారు. వీరిలో కరోనా పాజిటివ్ అని తేలితే వారికి క్వారంటైన్ కు పంపుతామన్నారు. అలాగే పై దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు తమ ఆరోగ్య స్థితిని తెలియజేయడానికి 'ఎయిర్ సువిధ' నింపడం తప్పనిసరి అని ఆయన చెప్పారు.


Next Story