- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల వేళ సీఎం స్టాలిన్ భారీ నజరానా.. మహిళల ఖాతాల్లో రూ. 5,000 జమ
తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ.. సీఎం స్టాలిన్ మహిళలకు శుభవార్త చెప్పారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.5 వేలు జమైనట్లు ఎక్స్ లో ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకం' కింద 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు మూడు నెలల ముందస్తు నగదుతో పాటు ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన ముందస్తు చెల్లింపుగా రూ. 3,000, దానికి తోడు వేసవి ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ. 2,000 కలిపి మొత్తం రూ. 5,000 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
ఎన్నికల సాకుతో మహిళలకు అందే ఈ సాయాన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అందుకే ముందస్తుగా ఈ నిధులు విడుదల చేశామని స్టాలిన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే.. ప్రస్తుతం ఇస్తున్న రూ. 1,000 నెలవారీ సాయాన్ని రూ. 2,000కు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (AIADMK) కూడా ఐదు ప్రధాన ఎన్నికల హామీలను ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్లను రూ. 1,200 నుండి రూ. 2,000కు పెంచుతామని హామీ ఇచ్చింది.
నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సేలంలోని సీలనాయకన్ పట్టిలో నేడు కీలక ఎన్నికల సమావేశాన్ని నిర్వహిస్తోంది. గతంలో జరిగిన తొక్కిసలాట సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కేవలం క్యూఆర్ కోడ్ ఉన్న పాస్‌లు కలిగిన 4,998 మందిని మాత్రమే వేదిక వద్దకు అనుమతిస్తున్నారు. గత సెప్టెంబర్‌లో జరిగిన ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల మళ్లింపుతో పాటు.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది తొలి సగభాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి. 2021 ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.






