Bombay Highcourt: భార్యపై వ్యభిచార అనుమానంతో పిల్లవాడికి డీఎన్ఏ పరీక్ష కుదరదు: బాంబే హైకోర్టు

by S Gopi |

ఒక వ్యక్తి తన భార్య వ్యభిచారం చేస్తోందని ఆరోపించిన మాత్రాన చేయించలేమని స్పష్టం చేశారు

Bombay Highcourt: భార్యపై వ్యభిచార అనుమానంతో పిల్లవాడికి డీఎన్ఏ పరీక్ష కుదరదు: బాంబే హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒక వ్యక్తి తన భార్య వ్యభిచారం చేసిందని అనుమానించినంత మాత్రాన, మైనర్ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయించడం సరైన నిర్ణయం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్య వ్యభిచారానికి పాల్పడుతుందనే అనుమానంతో ఆమె కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయించాలని, తనకు విడాకులు ఇప్పించాలని ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. దీనిపై డీఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఉత్తర్వులు ఇచ్చిన ఫ్యామిలీ హైకోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది. కేసును విచారించిన జస్టిస్ ఆర్ఎం జోషి.. డీఎన్ఏ పరీక్షను నిర్వహించేందుకు అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే ఆదేశాలు ఇవ్వగలం. ఒక వ్యక్తి తన భార్య వ్యభిచారం చేస్తోందని ఆరోపించిన మాత్రాన చేయించలేమని స్పష్టం చేశారు. పిటిషన్ వేసిన వ్యక్తి 2011లో తమకు వివాదం జరిగిందని, 2013 నుంచి వేరుగా ఉంటున్నట్టు చెప్పాడు. అయితే, అప్పటికే అతడి భార్య మూడు నెలల గర్భవతి. 2020లో ఫ్యామిలీ కోర్టు ఈ కేసుకు సంబంధించి బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేయగా, విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు వ్యభిచారం చేసినట్టు నిరూపించగలిగే ఇతర ఆధారాలను ఉపయోగించాలని సూచించింది. అంతే కానీ పుట్టిన బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. మైనర్ బాలుడు తల్లిదండ్రుల మధ్య ఘర్షణలకు సాధనంగా మారుతున్నాడని, ఇలాంటి సమయంలో బాలుడి హక్కులకు కోర్టు రక్షిస్తుందని పేర్కొంది. బాలుడు అనుమతి ఇచ్చే వయసులో లేడు కాబట్టి బలవంతంగా డీఎన్ఏ పరీక్షలు న్యాయబద్దం కాదని వెల్లడించింది.

Next Story