అప్పుడు బిడ్డను కని.. ఇప్పుడు అత్యాచారం అంటారా? సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-27 10:16:16  IST  )

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

అప్పుడు బిడ్డను కని.. ఇప్పుడు అత్యాచారం అంటారా? సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సహజీవన సంబంధాలపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ నుండి బయటకు రావడం అనేది స్వతహాగా నేరం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహ బంధం లేని ఇటువంటి సంబంధాలలో ఉండే ప్రమాదాలను కోర్టు ఈ సందర్భంగా ఎత్తిచూపింది. ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడి, దాడి చేశాడని ఆరోపిస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు అత్యాచారం అంటే ఎలా?:

ఇద్దరు మేజర్లు వివాహం చేసుకోకుండా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ సంబంధాల్లో కొన్ని సహజమైన ప్రమాదాలు ఉంటాయని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. "ఇది ఒక లివ్-ఇన్ రిలేషన్‌షిప్. వివాహం చేసుకోకుండానే ఆమెకు ఆ వ్యక్తితో బిడ్డ పుట్టారు. ఇప్పుడు ఆమె అత్యాచారం, దాడి అనడం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధం అత్యాచార ఆరోపణలకు ఎలా దారితీస్తుందని కోర్టు నిలదీసింది.

బాధితురాలిని నిందించడం కాదు:

ఇలాంటి ప్రశ్నలు బాధితులను అవమానించడమే అని తరచూ విమర్శిస్తారని న్యాయమూర్తి పేర్కొన్నారు. కానీ అంగీకారం (consent) యొక్క స్వభావం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. అంగీకారపూర్వక సంబంధం ఉన్నప్పుడు, నేరం అనే ప్రశ్నే ఎక్కడ వస్తుంది? అని ప్రశ్నించారు. సహజీవనంలో ఇలాగే జరుగుతుందని సంవత్సరాల తరబడి కలిసి జీవించి ఇప్పుడు విడిపోయాక ఆ మహిళ ఆ వ్యక్తిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేస్తోందని ఇవన్నీ వివాహేతర సంబంధాలలో ఉండే అనిశ్చితులు అని జస్టిస్ నాగరత్న అన్నారు.

ఆ బిడ్డ అక్రమ సంతానం కాదు:

పిటిషనర్ పట్ల కోర్టు సానుభూతి వ్యక్తం చేస్తూనే ఆమె తన బిడ్డ కోసం భరణం కోరవచ్చని న్యాయమూర్తి తెలిపింది. అయితే సహజీవనం విచ్ఛినం కావడం అనేది నేరపూరిత చర్యకు ఆధారం కాదని పేర్కొంది. సంబంధం అక్రమం కావచ్చు కానీ ఆ సంబంధం ద్వారా పుట్టిన బిడ్డ మాత్రం అక్రమం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ వివాహం జరిగి ఉంటే ఆమెకు మెరుగైన హక్కులు ఉండేవని పేర్కొన్నారు. ఈ సమస్యను మధ్యవర్తిత్వం (mediation) ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు కోర్టు సూచించింది.

Next Story