- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme court: కాఫీ తాగుతూ మాట్లాడుకోండి.. విడాకుల కోసం పిటిషన్ వేసిన జంటకు సుప్రీంకోర్టు సూచన
విడాకుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఓ జంటకు అత్యున్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: విడాకుల కేసు విచారణలో ఉండగా మరో వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఓ జంటకు అత్యున్నత న్యాయస్థానం కీలక సూచన చేసింది. తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి సామరస్యంగా మెలగాలని తెలిపింది. ఈ రోజు రాత్రి ఇద్దరు కలిసి డిన్నర్ చేయాలని, కప్పు కాఫీ తాగాలని సూచించింది. తద్వారా చాలా మార్పులు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. భర్తతో విడాకులు కావాలని కోరిన ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మీకు మూడేళ్ల పాప ఉంది. ఇద్దరి మధ్య అహంకారం ఎందుకు అని దంపతులను ప్రశ్నించింది.
‘మా క్యాంటీన్ మీకోసం మంచిది కాకపోవచ్చు. కానీ ఇద్దరి కోసం మరో డ్రాయింగ్ రూం కేటాయిస్తాం. ఈ రాత్రి ఇద్దరు కలిసి డిన్నర్ చేయండి. కాఫీ తాగుతూ మాట్లాడుకోండి. గతాన్ని చేదు మాత్రలా మింగేసి భవిష్యత్‌పై ఆలోచించండి’ అని ఆ జంటకు విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరు పక్షాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మంగళవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. పరస్పర చర్చలు, అవగాహనతో సంబంధంలో సానుకూల మార్పులు తీసుకురావొచ్చని అభిప్రాయపడింది. తదుపరి విచారణకు మంగళవారానికి వాయిదా వేసింది. కాగా, భార్య తమ 3 ఏళ్ల కుమార్తెతో యూరప్ వెళ్లడానికి కోర్టు అనుమతి కోరుతుండగా, భర్త ప్రయాణ పత్రాలపై సంతకం చేయడానికి నిరాకరించాడు. ఈ క్రమంలోనే ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.






