ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ మరో చిట్టా.. 17న విడుదల

by Dishanational4 |
ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ మరో చిట్టా.. 17న విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో : 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు విరాళాలను పొందేందుకు రాజకీయ పార్టీలు విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల చిట్టా ఇప్పటికే విడుదలైంది. ఇక 2019 ఏప్రిల్‌కు మునుపు దాదాపు ఏడాదిన్నర కాలం వ్యవధిలో జారీ చేసిన ఎన్నికల బాండ్ల వివరాలు కూడా బయటికి వచ్చే దిశగా శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవధికి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సీల్డ్ కవర్‌లో కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అందించింది. ఈ సమాచారాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా తమ అధికారిక వెబ్‌సైట్‌ వేదికగా ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. వాస్తవానికి 2019 ఏప్రిల్‌కు మునుపటి ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు ఈసీ సమర్పించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని మార్చి 15న సాయంత్రంలోగా దేశ ప్రజలకు బహిర్గతం చేయాలని మార్చి 11న ఈసీని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే 2019 ఏప్రిల్‌కు మునుపటి బాండ్ల కాపీలన్నీ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్దే ఉన్నాయని.. వాటిని తమకు అందిస్తేనే వివరాలను వెల్లడించగలుగుతామని పేర్కొంటూ ఈసీ ఒక పిటిషన్ వేసింది. దాన్ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సీల్డ్ కవర్‌లో ఆనాటి ఎన్నికల బాండ్ల సమాచారాన్ని ఈసీకి అందించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఇక ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లను సోమవారం (మార్చి 18) లోగా వెల్లడించాలని ఎస్‌బీని శుక్రవారంరోజు సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి ఎస్‌బీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.


Next Story

Most Viewed