- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme court: బుల్డోజర్ కూల్చివేతలు చట్టవిరుద్ధం.. యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్
బుల్డోజర్ చర్యలకు పాల్పడినందుకు గాను ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: బుల్డోజర్ చర్యలకు పాల్పడినందుకు గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీలపై సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్ల కూల్చివేతలు అమానవీయం, చట్టవిరుద్ధమైనవని అభివర్ణించింది. కూల్చివేతలు సరికావని ఇది మా మనస్సాక్షిని కదిలించిందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నందున ప్రజల ఇళ్లను ఇలా కూల్చివేయలేమని పేర్కొంది. పిటిషనర్లందరూ తమ ఇళ్లను కోల్పోయారని, ఐదుగురు ఇంటి యజమానులకు ఒక్కొక్కరికి ఆరు వారాల్లోగా రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించింది. బాధిత ప్రజలకు పరిహారం ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలను నియంత్రించాలని తెలిపింది.
2021లో ప్రయాగ్‌రాజ్ నగర అధికారులు ఓ న్యాయవాది, ప్రొఫెసర్, మరో ముగ్గురి ఇళ్లను గ్యాంగ్‌స్టర్ అతిక్ ఆస్తిగా పరిగణించి కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా లాయర్ జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మద్ ఇతరులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఇళ్ల కూల్చివేత ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. పిటిషనర్ల ఇళ్లను దారుణంగా కూల్చివేశారని ఫైర్ అయింది. ప్రతి బాధితునికీ పరిహారం నిర్దేశించాలని సూచించింది. పాలనా యంత్రాంగం నోటీసులకు స్పందించడానికి పిటిషనర్లకు టైం ఇవ్వలేదని ధర్మాసనం గుర్తించింది.
అయితే అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేస్తుండగా ఒక చిన్న అమ్మాయి తన ప్రాణాల గురించి పట్టించుకోకుండా ఇళ్లలో ఉంచిన పుస్తకాలను తిరిగి తీసుకురావడానికి పరిగెత్తుతూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని సైతం సుప్రీంకోర్టు ప్రస్తావించింది. పుస్తకాలతో పరుగెత్తిన బాలిక వీడియో అందరిని కదిలించిందని తెలిపింది. ఆశ్రయం పొందే హక్కు, చట్టబద్ధమైన ప్రక్రియ వంటివి దేశంలో ఉన్నాయని, ఈ తరహా చర్యలు సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తాయని కోర్టు తెలిపింది.






