Israel-Hamas: యుద్ధాన్ని ఆపాలి.. హమాస్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పాలస్తీనా ప్రజలు

by Shamantha N |

ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas) యుద్ధం వల్ల పాలస్తీనియన్ల పరిస్థితి అధ్వానంగా మారింది. గాజాలోని పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

Israel-Hamas: యుద్ధాన్ని ఆపాలి.. హమాస్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పాలస్తీనా ప్రజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas) యుద్ధం వల్ల పాలస్తీనియన్ల పరిస్థితి అధ్వానంగా మారింది. గాజాలోని పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల ప్రజలు శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో హమాస్ కు వ్యతిరేకంగా పాలస్తీనావాసులు నిరసన తెలిపడం గమనార్హం. యుద్ధానికి ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వందలామది మంది రోడ్లెక్కారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో వందలాది మంది పాలస్తీనియన్లు నిరసన చేపట్టారు. హమాస్ వ్యతిరేక నినాదాలు చేశారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం’ అని రాసిఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్‌ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. అయితే, ఇవి ఎవరి నేతృత్వంలో జరిగాయనేది తెలియలేదు. టెలిగ్రామ్‌లో వచ్చిన సందేశాల ఆధారంగానే తాము ఆందోళనల్లో పాల్గొన్నామని నిరసనకారుల్లో కొందరు తెలిపారు. మరోవైపు, హమాస్ మద్దతుదారులు తుపాకులు, లాఠీలను ఉపయోగించి వారిని బలవంతంగా చెదరగొట్టారు. ఇక, ఈ నిరసనలపై మిలిటెంట్‌ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, సంస్థ అనుకూలదారులు నిరసనకారులను దేశద్రోహులుగా ఆరోపించారు.

గాజాలో హమాస్ కు వ్యతిరేకత

2007 నుంచి గాజాను హమాస్ పాలిస్తుంది. ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో వేలమంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం ప్రారంభం నుంచి గాజాలో హమాస్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ఈనేపథ్యంలోనే ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ పొడిగింపును హమాస్ నిరాకరించింది. ఈక్రమంలో టెల్‌అవీవ్‌ తన దాడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో మిలిటెంట్‌ సంస్థపై పాలస్తీనావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య 17 నెలలకు పైగా యుద్ధం తర్వాత గాజా శిథిలావస్థకు చేరింది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయమని హమాస్‌ను ఒత్తిడి చేయడానికి ఇజ్రాయెల్.. మార్చి 2 నుంచి గాజాకు మానవతాసాయాన్ని నిరాకరించినప్పట్నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ఐడీఎఫ్ సైనిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినప్పటి నుండి కనీసం 792 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై క్రూరమైన దాడిని ప్రారంభించిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో 1,218 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు.

Next Story