రేపే చివరి దశ పోలింగ్

by S Gopi |

ఆఖరి ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.

రేపే చివరి దశ పోలింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పండుగ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం ఏడు దశల్లో జరిగిన ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరి దశ ఓటింగ్ శనివారంతో ముగుస్తుంది. ఇప్పటికే తుది దశ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఆఖరి ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అలాగే, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో మిగిలిన 42 అసెంబ్లీ సీట్ల కోసం ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఓటింగ్ జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఇప్పటివరకు పూర్తయిన ఆరు దశల ఓటింగ్‌లో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 486 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఏడవ దశలో బీహార్‌లో ఎనిమిది స్థాలకు ఓటింగ్ జరగనుండగా, చండీగఢ్(1), హిమాచల్ ప్రదేశ్(4), జార్ఖండ్(3), ఒడిశా(6), పంజాబ్(13), ఉత్తరప్రదేశ్(13), పశ్చిమ బెంగాల్(9) నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 10.06 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

ఓటర్ల కోసం మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 10.9 లక్షల మంది పోలింగ్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. బరిలో 904 మంది అభ్యర్థులు తమ రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి దశ పోలింగ్ ప్రధాన నేతలు బరిలో ఉన్నారు. వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో శనివారమే పోలింగ్ జరగనుంది. ప్రధాని మోడీపై పోటీకి కాంగ్రెస్ పార్టీ అజయ్ రాయ్‌ను బరిలో నిలిబెట్టింది. అలాగే, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటీ కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీలో ఉండగా, ఆమెపి పోటీగా కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్య సింగ్ ఉన్నారు. చండీగఢ్ నుంచి మనీష్ తివారీ(కాంగ్రెస్), సంజయ్ టాండన్(బీజేపీ), పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నుంచి టీఎంసీ తరపున అభిషేక్ బెనర్జీ, సీపీఐఎం నుంచి ప్రతీక్ ఉర్ రెహమాన్ ఉన్నారు.

Next Story