సీ295 విమానాల డెలివరీ పూర్తి.. 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందించిన స్పెయిన్

by Phanindra |

స్పెయిన్ నుంచి సీ295 విమానాల డెలివరీ పూర్తి అయింది. భారత వాయుసేనకు అందించాల్సిన 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో చివరి బ్యాచ్‌ను స్పెయిన్ డెలివరీ చేసింది.

సీ295 విమానాల డెలివరీ పూర్తి.. 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందించిన స్పెయిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: స్పెయిన్ నుంచి కొనుగోలు చేసిన 16 ఎయిర్‌బస్ సీ295 విమానాల లాస్ట్ బ్యాచ్‌ డెలివరీ పూర్తయింది. ఈ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ అందకోవడం దేశ రక్షణ సామర్ధ్యాలు మెరగవుతాయని స్పెయిన్‌లోని భారత ఎంబసీ తెలిపింది. భారత వాయుసేనలో పాతబడిపోతున్న ఆవ్రో ఎయిర్‌క్రాఫ్ట్‌లను సీ295 విమానాలతో భర్తీచేయనున్నారు.

స్పెయిన్‌లో భారత రాయబారి దినేష్ కె. పట్నాయక్, వాయుసేన సీనియర్ అధికారులు కలిసి చివరి బ్యాచ్ ఎయిర్‌బస్ సీ295 ట్రాన్స్‌పోర్ట్ విమానాలను అంందుకున్నారు. గడువు కన్నా రెండు నెలల ముందే ఈ డెలివరీ పూర్తయిందని, భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇదొక కీలకమైన మైలురాయి అని భారత ఎంబసీ తెలిపింది. ఈ సీ295 విమానాలు 11 గంటలపాటు ఎగరగలవు. 5-10 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటాయి.

2021లో స్పెయిన్‌లోని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో భారత్ మొత్తం 56 సీ295ఎండబ్ల్యూ విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ప్రకారం 16 విమానాలను నేరుగా ఎయిర్‌బస్ డెలివరీ చేస్తుంది. వీటిలో చివరి బ్యాచ్‌ను శనివారం నాడు భారత్‌కు అందించింది. మిగతా 40 విమానాలను భారత్‌లోనే తయారు చేయనున్నారు.

దీనికోసం గుజరాత్‌లోని వడోదరలో ఉన్న టాటా అడ్వాన్స్‌డ్ సిస్టం లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) క్యాంపస్‌లో ఈ విమానాలు తయారు చేసేందుకు టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్‌తోపాటు పలు చిన్నతరహా పరిశ్రమలన్నీ కూడా టీఏఎస్ఎల్‌తో కలిసి 40 సీ295 విమానాలను తయారు చేస్తాయి.

Next Story