Sonia Gandhi: ఆ విషయంలో భారత్ మౌనం దౌత్య వైఫల్యమే.. సోనియా గాంధీ

by B.Srinivas |

భీకరంగా కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు.

Sonia Gandhi: ఆ విషయంలో భారత్ మౌనం దౌత్య వైఫల్యమే.. సోనియా గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భీకరంగా కొనసాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ (Iran Israel) యుద్ధంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై ప్రభుత్వం మాట్లాడకపోవడం దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. దీని వల్ల భారత్ తన స్వరాన్ని కోల్పోవడమే గాక, నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాలను విస్మరించడమే అవుతుందని తెలిపారు. ఈ మేరకు తాజాగా ఆమె ఓ పత్రికలో వ్యాసం రాశారు. జూన్13న ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ చేసిన సైనిక దాడి చట్టవిరుద్ధమని, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రాంతీయ శక్తుల మధ్య ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. గాజాలో జరిగిన విధ్వంసం, ఇరాన్‌లో జరిగిన దాడుల గురించి భారత్ బాధ్యతాయుంగా మాట్లాడాలని, దీనికి ఇంకా ఆలస్యం కాలేదని సూచించారు.

ఇరాన్ గడ్డపై జరిగిన బాంబుదాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఇజ్రాయెల్ చర్యలు పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే గాక ప్రాంతీయంగా, ప్రపంచ వ్యాప్తంగా అస్థిరతకు దారి తీస్తు్న్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రభుత్వం శాంతిని అణగదొక్కడంలో, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో సుదీర్ఘమైన రికార్డును కలిగి ఉందని ఆరోపించారు. భారత్ చారిత్రాత్మకంగా ఇరాన్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగించిందని గుర్తు చేశారు. 1994లో కశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందని తెలిపారు. కానీ దీనికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు.

Next Story