అసభ్య కంటెంట్ తొలగిస్తాం.. అకౌంట్లు సస్సెండ్ చేస్తాం: ఎక్స్ ప్రకటన

by Phanindra |

సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో గ్రోక్ ఏఐ సాయంతో సృష్టించిన అసభ్య కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది

అసభ్య కంటెంట్ తొలగిస్తాం.. అకౌంట్లు సస్సెండ్ చేస్తాం: ఎక్స్ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో గ్రోక్ ఏఐ సాయంతో సృష్టించిన అసభ్య కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. అలాగే ఇలాంటి కంటెంట్ అప్‌లోడ్ చేసిన, ఏఐతో తయారు చేసిన యూజర్ల ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని కూడా తెలిపింది. దీని కోసం ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ‘ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్’ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. దీనికన్నా ముందు గ్రోక్‌ సాయంతో అశ్లీల కంటెంట్ సృష్టించడం, అలాంటి కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ కూడా హెచ్చరించారు.

ఈ క్రమంలోనే ఎక్స్‌లో పాటించాల్సిన నియమనిబంధనలను మరోసారి షేర్ చేసిన ఎక్స్ గ్లోబల్ గవర్నెన్స్.. నిబందనపలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. కాగా సాధారణ యూజర్లు షేర్ చేసే ఫొటోలను అశ్లీలంగా మార్చడం, మహిళలు-చిన్నారుల ఫొటోలను అప్‌లోడ్ చేసి అసభ్యంగా మార్చడం కోసం గ్రోక్ ఏఐను కొందరు వాడుకుంటుండటం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్పందించిన భారత కేంద్ర ప్రభుత్వం.. ఎక్స్‌ ఇండియా విభాగానికి నోటీసులు కూడా జారీచేసింది. సదరు కంటెంట్‌ను తొలగించి, రిపోర్టును సబ్మిట్ చేయాలని ఆదేశించింది. నిబంధనలు అనుసరించకుంటే చట్టప్రకారం అందిస్తున్న ఇంటర్మీడియరీ రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.

Next Story