నెహ్రూ నిజంగానే భారతీయులను సోమరిపోతులని అన్నారా?

by Dishanational5 |
నెహ్రూ నిజంగానే భారతీయులను సోమరిపోతులని అన్నారా?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ భారతీయులను సోమరిపోతులుగా అభివర్ణించారంటూ ప్రధాని మోడీ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సోమవారం ధన్యవాదాలు తెలిపే తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. ‘‘అప్పటి ప్రధాని జనహార్‌లాల్ నెహ్రూ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతీయులకు నైపుణ్యం లేదన్నారు. నెమ్మదిగా, సోమరుల్లా పని చేస్తారని కామెంట్ చేశారు. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే తక్కువేమీ కాదు. మనకు ఆత్మన్యూనత ఎక్కువని ఆమె చిన్నచూపు చూశారు. వాళ్లిద్దరికీ భారతీయుల శక్తిపై నమ్మకం ఉండేది కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో నెహ్రూ, ఇందిరాగాంధీలు నిజంగానే భారతీయులను సోమరిపోతులని అన్నారా? అనే అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

నెహ్రూ చేసిన అసలు ప్రసంగం

1959లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని నెహ్రూ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘భారత్‌లో కష్టపడి పనిచేసే అలవాటు లేదు. నిజానికి ఇది మన తప్పు కాదు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి అలాంటి అలవాట్లు ఏర్పడతాయి. కానీ, నిజమేంటంటే, మనం యూరోపియన్లు, జపనీయులు, చైనీయులు, రష్యన్లు, అమెరికన్ల మాదిరిగా కష్టపడి పనిచేయం. ఆ దేశాలన్నీ ఏదో మ్యాజిక్ జరిగి అభివృద్ధి చెందాయని అనుకోకండి. కృషి, తెలివితేటలతోనే వారి దేశాన్ని అభివృద్ధి చేసుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

ఇందిరా గాంధీ ఏమన్నారంటే..?

1974లో భారతీయుల ‘ఆత్మసంతృప్తి’, ‘ఓటమి వైఖరి’ గురించి ఇందిరా గాంధీ మాట్లాడుతూ, ‘‘ఏదైనా ఒక పని పూర్తిచేయగానే ఏదో సాధించామని ఆత్మసంతృప్తి పొందడం దురదృష్టవశాత్తు మన అలవాటుగా మారింది. అలాగే, మనం చేసే పనిలో ఏదైనా ఆటంకం ఏర్పడితే నిరాశ చెందుతాం. ఒక్కోసారి దేశం మొత్తం ఇలాగే పరాజయ ధోరణిని అవలంబించినట్లు అనిపిస్తుంది. ఆశను వదులుకుంటే ఏ సమస్యకూ పరిష్కారం దొరకదు’’ అని అన్నారు.


Next Story

Most Viewed