‘సెక్యులర్’ పాట పాడాలంటూ సింగర్‌పై దాడి!

by Phanindra |

‘సెక్యులర్’ పాట పాడాలంటూ సింగర్‌పై దాడి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం రేగింది.

‘సెక్యులర్’ పాట పాడాలంటూ సింగర్‌పై దాడి!
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ బెంగాలీ సింగర్ లగ్నాజిత చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్లో ఒక స్కూల్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సమయంలో పాట పాడుతుండగా ఒక టీఎంసీ నేత తనను ఇబ్బందిపెట్టారని, కొడతానని బెదిరించాడని ఆమె చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. తాను ‘జాగో మా’ అనే పాట పాడి మరో పాట ప్రారంభించే సమయంలో మెహబూబ్ మాలిక్ అనే ఒక వ్యక్తి వేదికపైకి దూసుకొచ్చినట్లు వెల్లడించారు. అందరి ముందు తనను కొడతానంటూ బెదిరించాడని ఆమె ఆరోపించారు. ఆ స్కూల్ ఓనర్లలో ఒకరైన మాలిక్.. ‘జాగో మా చాలు.. సెక్యులర్ పాట పాడు’ అంటూ తనను కొట్టేందుకు సిద్ధమయ్యాడని ఆమె అన్నారు.

ఈ ఘటన అంతా స్కూల్ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిందని, దాన్ని తొలగించే ముందే ఆ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని చక్రవర్తి కోరారు. భగవాన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు ఫైల్ చేయడానికి నిరాకరించారని కూడా ఆమె తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ.. దాడికి పాల్పడిన మెహబూబ్ మాలిక్ ఒక టీఎంసీ నేత అని, సెక్యులర్ పాట పాడలేదనే ఆమెపై దాడి చేయబోయాడని ఆరోపించింది. చక్రవర్తి, ఆమె టీంను మాలిక్ బృందం బెదిరించడంతో, వాళ్లు అర్ధరాత్రి కోల్‌కతాకు వెళ్లిపోవాల్సివచ్చిందని బీజేపీ నేత శంకుదేవ్ పండా తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే డైరీ ఎంట్రీ మాత్రమే చేసి, చిన్న క్షమాపణతో కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. మాలిక్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Next Story