Siddaramaiah: అది ప్రజల హక్కు.. మత మార్పిడిపై కర్ణాటక సీఎం వ్యాఖ్యల దుమారం

by Prasad Jukanti |

హిందూ మతంలో సమానత్వం ఉంటే అంటరానితనం ఎలా వచ్చిందని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Siddaramaiah: అది ప్రజల హక్కు.. మత మార్పిడిపై కర్ణాటక సీఎం వ్యాఖ్యల దుమారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మత మార్పిడులపై (Conversions) కర్ణాటక సీఎం సిద్దరామయ్య (Siddaramaiah) ఇటీవల చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మన హిందూ సమాజంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారుతారు? సమానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది? అంటరాని తనాన్ని మనం సృష్టించామా? సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ముస్లింలను సమానత్వం గురించి ప్రశ్నించే ధైర్యం మీకు ఉందా అని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం మాట్లాడుతూ.. ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ ఇతర మతంలోనైనా అసమానతలు ఉండవచ్చు. మేము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగలేదు కానీ ప్రజలు మతం మారుతారు. మతం మారడం వారి హక్కు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బీజేపీ ఫైర్:

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హిందూ వ్యతిరేకతను చూపిస్తోందని శాసనమండలిలో బీజేపీ సభ్యుడు సి.టి రవి బహిరంగ లేఖ రాశారు. సిద్ధరామయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను ఇతర మతాల్లోకి మారమని ప్రోత్సహిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఆరోపించారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ మతం పరువును తగ్గించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మతమార్పిడిలను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తింది. వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రచురించిన కులాల జాబితాలో క్రైస్తవులను కూడా చేర్చిందని ఈ తప్పును సరిదిద్దడానికి బదులు మత మార్పిడికి మద్దతుఇస్తోందని దుయ్యబట్టారు. సామాజిక సర్వే పేరుతో హిందూ సమాజాన్ని విభజించాలనే రహస్య ఎజెండా కాంగ్రెస్ కు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.

సోషల్ మీడియాలో రచ్చ:

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. హిందూమతంలో విమర్శలు చేయడం అందరికి అలవాటుగా మారిందని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే ఇస్లాంలో సమానత్వం ఉందా? అని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మతం మారారా అనే సందేహం కలుగుతోందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఆ రాష్ట్రంలో కులగణన (Cast Census) జరగనున్న వేళ ఈ వివాదం చిలికి చిలికి ఎక్కడి వరకు చేరుతుందో చూడాలి మరి.

Next Story