ఉత్కంఠకు ఎట్టకేలకు తెర.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-28 09:54:20  IST  )

గతకొన్ని నెలలుగా సాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు.

ఉత్కంఠకు ఎట్టకేలకు తెర.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని నెలలుగా సాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన తన పదవిని త్యాగం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 28వ తేదీన (ఈరోజు) బెంగళూరులోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మంత్రుల అల్పాహార సమావేశంలో సిద్దరామయ్య స్వయంగా ఈ విషయాన్ని తన కేబినెట్ సహచరులకు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన నేరుగా లోక్ భవన్‌కు చేరుకుని, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకరు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

హైకమాండ్ బుజ్జగింపులు..

ఇదిలా ఉంటే.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అధికార పంపకాల (పవర్ షేరింగ్) ఒప్పందంపై అంతర్గత చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితమే (మే 26) సిద్ధరామయ్య. డీకే శివకుమార్‌లను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో సుదీర్ఘ చర్చలు జరిపింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సహకరిస్తే సిద్ధరామయ్యకు కేంద్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని, రాబోయే ఎన్నికల్లో రాజ్యసభ స్థానాన్ని ఆఫర్ చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచీ స్పష్టమైన సందేశం రావడంతోనే ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఉన్న సిద్ధరామయ్య హుందాగా దిగిపోవడానికి అంగీకరించారు.

భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్..

ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన అల్పాహార సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. తాను రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించిన సమయంలో మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో కాంగ్రెస్ తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్, సిద్ధరామయ్యను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

Next Story