- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాకు పారని గోదావరి నీటి చుక్క .. దేవాదుల ప్రాజెక్టుపైనే ఆశలు!
ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో త్రాగునీరు, సాగు నీటి కోసం జే.చొక్కారావ్ - దేవాదుల ప్రాజెక్టు కీలకంగా మారనున్నది.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో త్రాగునీరు, సాగు నీటి కోసం జే.చొక్కారావ్ - దేవాదుల ప్రాజెక్టు కీలకంగా మారనున్నది. ఇప్పటికే అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తుండగా, చిరుజల్లులు పడడంతో రైతులు పలు రకాల పంటలను సాగు చేయడానికి విత్తనాలు నాటారు. ఈ సందర్భంలో వర్షాలు కురియకపోవడంతో విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడం కారణంగా రైతులు ఆందోళనలో పడ్డారు.
ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై పడటంతో ఈ సంవత్సరం అనుకున్న స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొనగా త్రాగునీరు, సాగు నీరు ఏ విధంగా అందించాలని ఆలోచనలో ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. గత పాలకులు సాగు, తాగునీరు పంపిణీ చేయడానికి కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను నిర్మించినప్పటికీ వాటి ద్వారా నీటిని సరఫరా చేసే అవకాశం లేకపోవడంతో ప్రస్తుత విపత్కర పరిస్థితిలో నీటిని తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి జలాలు గలగల పారుతూ సముద్రంలో కలుస్తున్న ప్రస్తుత తరుణంలో నీటిని నిల్వ చేయడానికి జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులు గూడెం వద్ద సమ్మక్క- సారలమ్మ బ్యారేజ్ ను ఏర్పాటు చేసింది.
గత పాలకులు ఏర్పాటు చేసిన ఈ బ్యారేజీలతో నీటిని నిలువ చేసే అవకాశం లభించగా దేవాదుల భారీ ప్రాజెక్టు ద్వారా నీటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకవైపు కరువు పరిస్థితి ముంచుకొస్తున్న తరుణంలో దేవాదుల ప్రాజెక్టు కీలకంగా మారబోతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని తరలించే ఆలోచనలు పాలకులు ఉన్నట్లు సమాచారం. అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోతేప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టు ద్వారా అవసరాలను తీర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. పైపులైన్లు, సొరంగ మార్గాల ద్వారా నీటిని ఎస్సారెస్పీ కాలువలకు తరలించి నీటి సమస్య తీర్చడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.
భారీ ఆశలతో దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం
సమైక్య రాష్ట్రంలో నీటి సమస్యను తీర్చాలని ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారం ప్రాంతం వద్ద పీ.వీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు (దేవాదుల) ప్రాజెక్టు నిర్మాణానికి 2008 సంవత్సరం మార్చి 14వ తేదీన శ్రీకారం చుట్టింది. అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జల యజ్ఞం అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా తీసుకొని మూడు దశల ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించింది. మొదటి దశలో 844 కోట్ల రూపాయలతో 267 కిలోమీటర్ల దూరం వరకు 10 క్యూమెక్కుల నీటిని 0.78 వేల ఆయకట్టుకు నీటిని తరలించాలని సంకల్పించింది.
రెండవ దశలో 1887 కోట్ల రూపాయలతో 469 కిలోమీటర్ల వరకు 14 క్యూమెక్కుల నీటిని 1.09 ఎకరాల ఆయకట్టుకు, మూడవ దశలో 3356 కోట్ల రూపాయలతో 469 కిలోమీటర్ల వరకు 50 క్యూమెక్కుల నీటితో 3.58 లక్షల ఎకరాల ఆయకట్టకు నీటిని తరలించడానికి దీనిని ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ 4 లక్షల 23 వేల 578 ఎకరాలకు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లక్షల 57 వేల 508 ఎకరాలకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 68 వేల 914 ఎకరాలకు సాగు నీటిని తరలించడానికి నిర్ణయించింది. అనుకున్న స్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా గత కొద్ది సంవత్సరాల నుండి నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో నీటి సమస్య ఏర్పడడంతో దేవాదుల ప్రాజెక్టు కీలకంగా మారనున్నది.
జిల్లాకు చుక్క నీరు రాని వైనం..
జిల్లా సమీపంలో ఉండే గోదావరి జిల్లాలు గలగల పారిపోతున్నప్పటికీ ములుగు ప్రాంతానికి చుక్క నీరు రావడం లేదు. సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన అనంతరం గోదావరి జలాలు ములుగు ప్రాంతానికి తరలించే విషయంలో పాలకులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదు. ములుగు ప్రాంతంలో కాకతీయుల నాటి సరస్సులు, అనేక చెరువులు ఉన్నప్పటికీ వేసవి కాలంలో నీరు లేక వేలవెలబోతున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలోని రంగరాయి చెరువుకు నీటిని తరలించాలని ఉద్దేశంతో రామప్పలో నీటిని నింపుతున్నప్పటికీ ఇక్కడి ప్రాంతానికి నీరు రాకపోవడం నిరాశ పరుస్తున్నది. ఇప్పటికైనా పాలకులు గోదావరి జలాలను ములుగు ప్రాంతానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.






