శ్రద్ధా, నిక్కీ, మేఘా.. ముగ్గురిది ఒకే కథ.. ఒకే ముగింపు

by Javid Pasha |
శ్రద్ధా, నిక్కీ, మేఘా..  ముగ్గురిది ఒకే కథ.. ఒకే ముగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులకు పండగరోజు. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి, ఉన్న ప్రేమను మరింత పెంచుకోవడానికి లవర్స్ ఈ వాలెంటైన్స్ డే ను ఒక అవకాశంగా వాడుకుంటారు. తన లవర్ ను జీవిత భాగస్వామిగా చేసుకొని నూరేళ్లు జీవించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అలాంటి కలలు కన్నవాళ్లే శ్రద్ధా వాల్కర్, నిక్కీ యాదవ్, మేఘా. కానీ ప్రేమించినవాళ్ల చేతే ఈ ముగ్గురు దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ముగ్గురి చావులో కామన్ పాయింట్ లవర్. వీళ్ల ఉదంతం చూసిన తర్వాత ప్రేమ అనే పదం మీద చాలా మందికి నమ్మకం పోకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..?


1.శ్రద్ధా వాల్కర్

శ్రద్ధా వాల్కర్‌ (26) ముంబైలోని ఓ ప్రముఖ కాల్‌సెంటర్‌లో పనిచేసేది. ఈ క్రమంలోనే ఆమెకు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరూ సహజీవనం ప్రారంభించారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబితే ఒప్పుకోకపోవడంతో ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ దక్షిణ ఢిల్లీ మెహ్రాలిలోని ఓ ఫ్లాట్ ని అద్దెకు తీసుకుని ఉండసాగారు. అయితే ఈ క్రమంలోనే శ్రద్ధా తన బాయ్ ఫ్రెండ్ వద్ద పలుమార్లు వివాహ ప్రస్తావన తీసుకొచ్చేది. అందుకు పూనావాలా రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చేవాడు. కానీ మే 2022 మే 18న పెళ్లి విషయంలో వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. దీంతో శ్రద్ధాను ఆఫ్తాబ్ చంపేశాడు.

హత్య విషయం బయటకు పొక్కకుండా నిందితుడు ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. వాటిని దాచిపెట్టేందుకు 300 లీటర్ల ఫ్రిడ్జ్‌ను కొన్నాడు. వాసన బయటకు రాకుండా అగర్‌బత్తీలు వెలిగిస్తూ, రూమ్‌ ఫ్రెష్‌నర్లు కొట్టేవాడు. అర్ధరాత్రి దాటాక సుమారు 18 రోజులపాటు శరీర ముక్కలను ఢిల్లీ పురవీధుల్లో దొరక్కుండా విసిరేసేవాడు. అలా యువతి మృతదేహం జాడ లేకుండా చేశాడు. రెండు నెలలుగా శ్రద్ధ ఫోన్‌ కలువడం లేదని ఆమె స్నేహితులు తండ్రికి ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. నవంబర్‌ 8న శ్రద్ధ తండ్రి ఢిల్లీలోని వారి ఫ్లాట్‌కు వచ్చి చూడగా తాళం వేసి ఉన్నది. వెంటనే ఆయన తన కూతురు కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆఫ్తాబ్‌ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో దారుణ హత్య ఘటన వెలుగుచూసింది. కన్న తల్లిదండ్రులను కాదని ప్రియుడిని నమ్మి బయటకు వెళ్లిన శ్రద్ధా చివరికి ప్రియుడి చేతిలోనే ఘోరంగా హత్యచేయడింది.


2. నిక్కీ యాదవ్

నిక్కీ స్వస్థలం హర్యానాలోని ఝాజ్జర్. కానీ చదువు రీత్యా ఆమె ఢిల్లీలో ఉంటోంది. మెడికల్ పరీక్షల ప్రిపేరవుతున్న క్రమంలోనే నిక్కీ కి సాహిల్ గెహ్లాట్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ గ్రేటర్ నోయిడాలో ఓ ఫ్లాట్ ని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. 2020 కరోనా లాడ్ డౌన్ వల్ల నిక్కీ తన స్వస్థలానికి వెళ్లింది. అయితే ఆమె ఇటీవలే ఢిల్లీకి వచ్చింది. ఈ క్రమంలోనే సాహిల్ మరో యువతితో పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం నిక్కీకి తెలిసింది.

ఈ క్రమంలోనే ఆమె నిక్కీని కలిసి నిలదీసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే యువతితో ఎలా కమిట్ అవుతాని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సాహిల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ మెడకు బిగించి నిక్కీని నిక్కీని హత్య చేశాడు. అనంతరం ఆమెను ఫ్రిడ్జ్ లో దాచి అదే రోజు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఈ ఘటన వెలుగులోకి రాగా.. ఈ నెల 9న ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విధంగా నమ్ముకున్న ప్రియుడే నిక్కీ పాలిట యముడిలా మారాడు.


3. మేఘా

వృత్తి రిత్యా నర్సు అయిన మేఘా ధన్ సింగ్ తోర్వి(37) తన ప్రియుడు హార్దిక్ షా (27)తో కలిసి కొంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంది. వీరు ముంబైలోని సీతా సదన్ సొసైటీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ 6 నెలలుగా సహజీవనం చేస్తున్నారు. కాగా మేఘా బాయ్ ఫ్రెండ్ ఎటువంటి జాబ్ చేయకపోవడంతో వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే నిందితుడు మేఘాను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పరుపులో కుక్కి అక్కడి నుంచి పరారయ్యాడు.

అయితే కొద్దిరోజులకు వారి అద్దే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి పక్కన ఉన్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా పరుపులో కుళ్లిన మహిళా మృతదేహం లభించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. ఇలా మేఘా కూడా ప్రేమ పేరుతో వంచనకు గురై హత్య కావించబడింది.

Next Story