- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూణే ల్యాండ్ స్కాంలో దర్యాప్తు చేయాల్సిందే: శరద్ పవార్
పూణే ల్యాండ్ స్కాంలో దర్యాప్తు చేయాల్సిందేనని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. మునిమనుమడు పార్థ్‌పై దర్యాప్తు అవసరమేనన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: తన మునిమనుమడు పార్థ్ పవార్‌కు చెందిన కంపెనీపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించిన దర్యాప్తును ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సమర్థించారు. ఇది సీరియస్ ఇష్యూ అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారని, కాబట్టి దీనిపై దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన అన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఉన్న శరద్ మేనల్లుడు అజిత్ పవార్‌ను కూటమి ప్రభుత్వంలోని మిత్రులే టార్గెట్ చేస్తున్నారా? అని ప్రశ్నించగా.. తనకు తెలియదని శరద్ పవార్ చెప్పారు. పార్థ్ ఎలాంటి తప్పుడు పనులు చెయ్యడని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలను కూడా శరద్ పవార్ సమర్థించలేదు. అది ఆమె అభిప్రాయమన్నారు.
‘పవార్స్ కుటుంబంగా మేం ఒక్కటే. కానీ మా మధ్య కూడా సైద్ధాంతిక విభేదాలున్నాయి. నా మనవళ్లలో ఒకరు అజిత్ పవార్‌పై పోటీ చేశారు. అజిత్ భార్య నా కూతురిపై పోటీ చేసింది. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు’ అని ఆయన వివరించారు. త్వరలోనే విపక్ష మహా వికాస్ అఘాదీ కూటమి సమావేశమై స్థానిక ఎన్నికల్లో వ్యూహాలను చర్చించుకుంటుందని చెప్పారు.
అజిత్ పవార్ రియాక్షన్..
ఈ విషయం బయటకొచ్చిన తర్వాత సీఎం ఫడ్నవీస్‌ను అజిత్ పవార్ కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఆ ప్రభుత్వ భూమిని అమ్మడానికి వీల్లేదు. ఈ విషయం నా కొడుకు పార్థ్, అతని పార్టనర్ దిగ్విజయ్ పాటిల్‌కు తెలియదు. అసలు ఆ స్థలం రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? అనే విషయం దర్యాప్తులోనే బయటకొస్తుంది. ఏసీఎస్ వికాస్ ఖర్గే నేతృత్వంలో వేసిన దర్యాప్తు కమిటీ నెలరోజుల్లో రిపోర్టు సబ్మిట్ చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. పార్థ్‌కు చెందిన అమాడియా ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ సంస్థకు భూమిని ట్రాన్స్‌ఫర్ చేయాలని ఏ అధికారి మీదా ఒత్తిడి వేయలేదని కూడా ఆయన చెప్పారు. తను, తన ఆఫీసు నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ చేయలేదని, ఈ విషయం గురించి అసలు తమకు ఏం తెలియదని ఆయన వివరించారు.
స్కాం ఏంటి?
పూణేలోని ముంధ్వాలో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక కంపెనీ కొన్నది. ఈ భూమి విలువ రూ.1800 కోట్లు ఉంటుంది. కానీ సదరు కంపెనీ మాత్రం కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించి ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో స్టాంప్ డ్యూటీ నుంచి కూడా ఆ కంపెనీకి మినహాయింపు లభించింది. ఈ కంపెనీ.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తనయుడు పార్థ్ పవార్‌కు సంబంధించింది కావడంతో ఈ కొనుగోలుపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వం అండతోనే ఇదంతా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇది చాలా సీరియస్ అంశం అని, నిజానిజాలు బయటపెట్టేందుకు దర్యాప్తునకు ఆదేశించామని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు.






