వైద్య విద్యార్థుల స్థానికత అంశం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-01 06:28:32  IST  )

వైద్య విద్యార్థుల స్థానికత అంశం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

వైద్య విద్యార్థుల స్థానికత అంశం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్యార్థుల స్థానికత అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ మేరకు గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ సీజేఐ జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి కోర్టు తేల్చి చెప్పింది. అదేవిధంగా స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.33 ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. తెలంగాణలో లోకల్‌ రిజర్వేషన్లు పొందాలంటే.. కనీసం 9వ తరగతి నుంచి 12 వరకు చదవాల్సిందేనని సర్కార్ పెట్టిన నిబంధనను సమర్ధిస్తూ.. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే, గతేడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థుల అలాగే కొనసాగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో వైద్య విద్యార్థులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా వచ్చిన తీర్పుతో ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు యూజీ కోర్సులకు లోకల్ కోటా రిజర్వేషన్ల తీర్పు వర్తించనుంది.

కాగా, పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదంటూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులపై పలువురు వైద్య విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థుల పిటిషన్‌పై విచారించి తగిన నిబంధనలు రూపొందించాలని ధర్మాసనం వెలువరించింది. స్థానికత అంటే ఏంటి, అందులో ఎవరెవరు వస్తారు, అందుకు ఉన్న పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును విద్యార్థులు సుప్రీంలో సవాల్‌ చేయగా.. ఆ పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోనే ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.33ను తీసుకొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ తెలిపారు.

ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371 (D) ప్రకారం ఉందని కోర్టుకు విన్నవించారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులకు కల్పించిన గడువు ముగిసిపోవటంతో ఈ జీవోను తెచ్చారని స్పష్టం చేశారు. దీని ప్రకారం సివిల్‌ సర్వీసెస్‌, ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యుటేషన్‌పై వెళితే, ఇతర రాష్ట్రాల్లో చదువుకొన్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడి పెట్డకుండా లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టితో ఆలోచించాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే, పదేళ్లు స్థానికంగా ఉండి రెండేళ్లు బయటకు వెళితే స్థానికత ఎలా కోల్పోతారని ధర్మాసనం ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మనుసింఘ్వీని ప్రశ్నించింది. 2024లో తీసుకొచ్చిన నిబంధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతుందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని వాదనల సందర్భంగా సీజేఐ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story