కారులో భారీగా పేలుడు పదార్థాలు.. న్యూ ఇయర్ వేళ కలకలం రేపిన ఘటన

by Naga Rani Yarlagadda |

నూతన సంవత్సర వేడుకలకు దేశమంతా రెడీ అవుతున్న వేళ.. ఓ కారులో భారీఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటన కలకలం రేపింది.

కారులో భారీగా పేలుడు పదార్థాలు.. న్యూ ఇయర్ వేళ కలకలం రేపిన ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకలకు దేశమంతా రెడీ అవుతున్న వేళ.. ఓ కారులో భారీఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటన కలకలం రేపింది. రాజస్థాన్లో ఓ కారులో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఇతర పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో నిందితులు పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు టోంక్ జిల్లా పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద కారులో పోలీసులు తనిఖీలు చేయగా.. యూరియా సంచుల్లో 150 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను గుర్తించారు. దానితో పాటు 200 కాట్రిడ్జ్ లు, 6 కట్టల సేఫ్టీ ఫ్యూజ్ వైర్ (1100 మీటర్లు)ను కూడా స్వాధీనం చేసుకుని, కారును సీజ్ చేశారు.

పేలుడు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. వీరిద్దరినీ బూందీ జిల్లాకు చెందిన సురేంద్ర పట్వా, సురేంద్ర మోచీలుగా గుర్తించారు. బూందీ నుంచి టోంక్ కు తరలిస్తున్న ఈ పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి సేకరించారు? ఎందుకోసం తరలిస్తున్నారు? అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో దేశంలో న్యూ ఇయర్ ఈవెంట్లకు మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన తర్వాత.. న్యూ ఇయర్ వేడుకలను ఉగ్రమూకలు టార్గెట్ చేసినట్లు ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో పోలీసులు ప్రతీ వీధిని జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story