టాప్ మావోయిస్టు నేత సోధి కన్నా ఎన్‌కౌంటర్.. బీజాపూర్‌లో భారీ కూంబింగ్!

by Phanindra |

బీజాపూర్‌లో భద్రతా దళాలు భారీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లో టాప్ మావోయిస్టు నేత సోధి కన్నా మరణించారు.

టాప్ మావోయిస్టు నేత సోధి కన్నా ఎన్‌కౌంటర్.. బీజాపూర్‌లో భారీ కూంబింగ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా దళాలు భారీస్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో సీనియర్ మావోయిస్టు కమాండర్ సోధి కన్నా మరణించారు. నేషనల్ పార్క్ ఏరియాలో జరిపిన కాల్పుల్లో ఆయన మరణించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సీనియర్ మావోయిస్టు లీడర్లు, సాయుధులైన కేడర్ ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు.. జులై 4వ తేదీన భారీ స్థాయిలో కూంబింగ్ చేపట్టారు. ఆ మరుసటి రోజు జరిగిన ఎన్‌కౌంటర్లో పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ఒకటో నెంబర్ బెటాలియన్‌లోని కంపెనీ నెం.2లో డిప్యూటీ కమాండర్, సీవైపీఎం/డీవీసీఎం (డివిజనల్ కమిటీ సభ్యుడు)గా ఉన్న కన్నను భద్రతా దళాలు హతమార్చాయి. ఆయన తలపై రూ.8 లక్షల నజరానా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి కన్నా మృతదేహం, ఒక .303 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో బీజాపూర్, దంతెవాడకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) యూనిట్లు, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా 202, 210 బెటాలియన్లు, యంగ్ ప్లటూన్లు సంయుక్తంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

మారణహోమం ఆపండి: ప్రొఫెసర్ జి.హరగోపాల్

సోమవారం సాయంత్రం సుమారు 30 వేల మంది కేంద్ర పోలీసు బలగాలు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతీ నేషనల్ పార్క్‌లో మావోయిస్టులను, ఆదివాసీలను చుట్టుముట్టి ఫైరింగ్ చేస్తున్నారని ప్రముఖ పౌరహక్కుల కార్యర్త ప్రొఫెసర్ జి. హరగోపాల్ తెలిపారు. ‘మావోయిస్టులు లొంగిపోవాలని, లేదంటే చావుకు సిద్ధం కావాలని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ హెచ్చరిస్తు్న్నారు. గణపతి, హిడ్మా వంటి నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ మారణహోమంపై ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు వామపక్ష పార్టీలు, మేధావులు తక్షణమే స్పందించాలి. పోలీసులు చట్టప్రకారం చర్యలు చేపట్టకుండా హత్యలు చేయడం, చంపేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం. ఈ కాల్పులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపేయాలని అన్ని వర్గాల వారు డిమాండ్ చేయాలి’ అని హరగోపాల్ పిలుపునిచ్చారు.

Next Story