ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఉత్తర్వులు జారీ చేసిన సీఈసీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-01 07:36:23  IST  )

భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక(Election of Vice President)కు రంగం సిద్ధమైంది.

ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. ఉత్తర్వులు జారీ చేసిన సీఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక (Election of Vice President)కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటించనున్నట్లుగా సీఈసీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా ఈ నెల 7న ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్ల సమర్పణకు ఆగస్టు 21 వరకు తుది గడవు ఇవ్వనున్నారు. వచ్చిన నామినేషన్లను ఆగస్టు 22 వరకు పరిశీలించి.. ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడవు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోర్ జాబితా (Electoral Collage) సిద్ధం అయినట్లుగా గురువారం ఈసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 (1) ప్రకారం భారత ఉప రాష్ట్రపతిని రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ సభ్యులు, లోక్ సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుందని తెలిపింది. ఉప రాష్ట్రపతి-2025 ఎన్నిక కోసం సంబంధిత సభలు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఆధారంగా అక్షరక్రమానుసారం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసినట్లు ఎన్నికల సంఘం అసిస్టెండ్ డైరెక్టర్ అపూర్వ కుమార్ సింగ్ తెలిపారు. ఇటీవలే ఉప రాష్ట్రపతి పదవికి మరో రెండేళ్లు సమయం ఉండగానే జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది.

Next Story