ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్

by Disha Web Desk 17 |
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్
X

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ బెయిల్ కోరుతూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన ఈ అప్పీల్ పిటిషన్ వేశారు. పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందనే కారణంతో హైకోర్టు జైన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

తనకు సంబంధమున్న 4 కంపెనీల ద్వారా లెక్కల్లో చూపని సొమ్మును లాండరింగ్ చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో సత్యేంద్ర జైన్ ను 2022 మే 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. అయితే ఈ ఆరోపణలను జైన్ తోసిపుచ్చారు. దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని, ఛార్జిషీటు నమోదైన తర్వాత కూడా ఇంకా జైలులోనే నిర్బంధించడం సరికాదని ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు ఆయన విన్నవించారు.

అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సీబీఐ నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి.. 2022 మే 31న జైన్‌ ను ఈడీ అరెస్టు చేసింది. జైలు గదికి ఇద్దరు ఖైదీల తరలింపుపై.. మే 11న తీహార్ జైలు అధికారులకు సత్యేంద్ర జైన్ ఒక లేఖ రాశారు. ‘ఒంటరితనం వల్ల నేను ఆందోళనకు గురవుతున్నాను. నేనుంటున్న గదిలో కనీసం ఇద్దరు వ్యక్తుల్ని నాకు తోడుగా ఉంచండి’ అని కోరారు.

దాంతో సూపరింటెండెంట్.. ఇద్దరు ఖైదీలను ఆయన గదికి తరలించారు. దీంతో తీహార్ జైలు సూపరింటెండెంట్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసి, చర్యలు ప్రారంభించారు. భద్రతా కారణాల దృష్ట్యా సత్యేంద్ర జైన్ సెల్ లోకి పంపిన ఇద్దరు ఖైదీలను మళ్ళీ మునుపటి స్థానాలకు మార్చారు.


Next Story

Most Viewed