Pahalgam Terror attack: పహల్గాం​ ఉగ్రదాడి సూత్రధారి ‘సైఫుల్లా కసూరి’.. ఇంతకీ ఎవరితను?

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-23 05:24:02  IST  )

పాక్ ​ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ -ఎ-తోయిబా డిప్యూటీ చీఫ్‌గా ఉన్న సైఫుల్లా కసూరిని పహల్గామ్ ​ఉగ్రదాడికి సూత్రధారిగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

Pahalgam Terror attack:  పహల్గాం​ ఉగ్రదాడి సూత్రధారి ‘సైఫుల్లా కసూరి’.. ఇంతకీ ఎవరితను?
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్ ​ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్ -ఎ-తోయిబా డిప్యూటీ చీఫ్‌గా ఉన్న సైఫుల్లా కసూరిని పహల్గామ్ ​ఉగ్రదాడికి సూత్రధారిగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతడిని సైఫుల్లా కసూరి అలియాస్ సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా సాజిద్ జాట్‌గా కూడా పిలుస్తారు. ఇతడు పాకిస్థాన్‌లోని పంజాబ్​ప్రావిన్స్‌లో ఉన్న కసూర్​జిల్లాకు చెందిన వాడు. ఇతడికి సుమారు 45 ఏళ్ల వయస్సు ఉంటుందని అంచనా. కశ్మీరీ మహిళను వివాహం చేసుకున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.

లగ్జరీ లైఫ్​

ఉగ్రవాదం, జిహాదీపై విస్తృతంగా ప్రసంగాలు చేసే సైఫుల్లాకు లగ్జరీ లైఫ్​అంటే ఎంతో ఇష్టం. ఇస్లామాబాద్‌లోని సంపన్న వర్గాలు నివసించే ఏరియాల్లో ఇతడిని పలు భవంతులు ఉన్నాయని సమాచారం. ఇతడు భారీ భవంతుల్లో ఉన్న కొన్ని వీడియోల్లో సైతం ఉన్నాయి. సైఫుల్లాకు మరో వ్యసనం.. లగ్జరీ కార్లు ఇతడు ఇస్లామాబాద్​లోని మసీదులకు పదుల సంఖ్యలో కార్ల కాన్వాయ్‌తో వెళ్తాడు. అందులో రూ.కోట్ల ఖరీదైన అమెరికా, యూరప్​ దిగుమతి కార్లు ఉంటాయని తెలుస్తున్నది.

లష్కర్‌లో అన్నీతానే..

ఉగ్రవాద సంస్థ లష్కర్ -ఎ-తోయిబాలో సైఫుల్లా పూర్తి ఆధిపత్యం సాధించాడు. సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్​సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. ఆపరేషన్​కమాండర్‌గా మాత్రమే కాక, ఉగ్ర శిబిరాలకు ఆర్థిక లావాదేవీలు సైతం నిర్వహిస్తాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ముస్లిం దేశాల్లోని ధనవంతులను కలిసి ఉగ్రవాదులకు సాయం చేయాల్సిందిగా కోరుతాడని.. అతడి ప్రసంగాలకు అనేక దేశాల్లో ఎంతో ఆదరణ కూడా ఉన్నదని తెలుస్తున్నది.

ఫిబ్రవరి 2న ఏం జరిగింది?

ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఖైబర్​పఖ్తన్ఖ్వాలో పాక్ సైన్యం, ఐఎస్‌ఐ భారీ సభ నిర్వహించింది. ఈ సభకు సైఫుల్లా ముఖ్య​అతిథిగా హాజరై ప్రసంగించాడు. ఈ సందర్భంగానే భారత్‌పై విద్వేషపూరిత ప్రసంగం చేశాడని, ఏడాదిలోగా అంటే 2026 ఫిబ్రవరి 2 కల్లా కశ్మీర్‌ను విముక్తి చేశాడని ప్రతిజ్ఞ చేశాడని సమాచారం. ఈ సమావేశంలోనే సైనికాధికారులు, ఐఎస్‌ఐ అధికారులు అతడికి సన్మానం చేయడం విశేషం.

వీవీఐపీ భద్రత

పాకిస్థాన్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో సైఫుల్లా ఒకరు. అతడిని పాక్​సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోంది. ఎటు వెళ్లినా భారీ కాన్వాయ్‌తోనే అతడికి రక్షణగా ఉంటుంది. పాక్​సైన్యం నిర్వహించే సమావేశాల్లోనూ హాజరై సైనికులకు బోధనలు చేస్తాడని సమాచారం.

Next Story