అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న శబరిమల.. స్వాములకు అధికారుల కీలక సూచనలు

by Ramesh Naini |

అయ్యప్ప స్వాములకు శబరిమల ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు.

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న శబరిమల.. స్వాములకు అధికారుల కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అయ్యప్ప స్వాములకు శబరిమల ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. రేపటి నుంచి భక్తులకు అయ్యప్ప దర్శనం ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. మండల, మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కావడంతో ఆలయ తలుపులను అధికారులు విధివిధానాలతో తెరిచారు. మేల్‌శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులు తెరిచారు. వరుడాయే మండల, మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ అధికారికంగా ప్రారంభమవడంతో దేవాలయ పరిసరాలు భక్తిజనాలతో కిక్కిరిసే అవకాశం ఉంది. రేపటి నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్ చేసుకున్న భక్తులకే స్వామి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లు..

భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సూచికలను ఏర్పాటు చేసి భక్తులకు మార్గదర్శనం చేయనున్నారు. శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే యాత్రికుల కోసం ప్రత్యేక ఆక్సిజన్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు అధికారుల సమాచారం. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ చికిత్స అందుబాటులో ఉండగా, పరిసర ఆసుపత్రుల్లో డీఫిబ్రిలేటర్లు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటర్ల వంటి అత్యవసర పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

నీలక్కల్ బేస్ వద్ద పూర్తిస్థాయి ల్యాబ్‌లు పనిచేయనున్నాయి. శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్‌, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. పందలం, అడూర్, వడసేరిక్కర, పథనం తిట్ట వంటి ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర వైద్య సహాయం కోసం ఎమర్జెన్సీ నంబర్ 04735-203232 సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Next Story