- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేనా ఫ్రెండ్‌షిప్?.. భారత్‌పై అమెరికా సుంకాలపై రష్యా ప్రతినిధి విమర్శలు
ఇదేనా ఫ్రెండ్‌షిప్? అంటూ భారత్‌పై అమెరికా సుంకాలపై రష్యా దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్ విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై యూఎస్ వేస్తున్న సుంకాలను రష్యా చార్జ్ డిఅఫైర్స్ రోమన్ బబుష్కిన్ తప్పుపట్టారు. పలు సందర్భాల్లో భారత ప్రధాని మోడీని ‘ఫ్రెండ్’ అంటూ సంబోధించిన ట్రంప్.. ఇలా సుంకాలు వేయడాన్ని విమర్శించారు. ఇలా స్నేహితులను అవమానించినందుకు ట్రంప్‌ను తప్పుబట్టిన బబుష్కిన్.. అవసరమైతే భారత ఎగుమతులను రష్యా మార్కెట్లు స్వాగతిస్తాయని ప్రకటించారు. ‘ఈ ఆంక్షలు అక్రమ పోటీతత్వానికి ఉపయోగపడే టూల్స్. ఈ డబుల్ స్టాండర్డ్స్ కేవలం నమ్మకం లేకపోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం, ఒత్తిడి తీసుకురావడమే కాదు.. ఇతర దేశాల అవసరాలను అవమానించడం కూడా. స్నేహితులు ఎక్కడైనా ఇలా ప్రవర్తిస్తారా?’ అని అమెరికాపై విమర్శల వర్షం కురిపించారు.
మీడియా సమావేశాన్ని హిందీలో ప్రారంభించిన బబుష్కిన్.. రష్యా-భారత్ సంబంధాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డాయని కొనియాడారు. ‘ఈ సుంకాల వల్ల యూఎస్‌కు భారతీయ వస్తువులు ఎగుమతులు చేయలేకపోతే.. వాటిని రష్యాకు పంపండి’ అని ఆఫర్ ఇచ్చారు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం 2024-25లో రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి 4.88 బిలియన్ డాలర్ల ఎగుమతులు రష్యాకు వెళ్తున్నాయి. ఇదే అంశాన్ని చెప్పిన బబుష్కిన్.. ఇటీవలి కాలంలో భారత్-రష్యా వాణిజ్యం ఏడు రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. పాశ్చాత్య దేశాలను విమర్శించిన ఆయన.. ‘పాశ్చాత్య దేశాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయంటే మనం ఏదో సరైన పని చేస్తున్నట్లే. ఈ ఆంక్షలు విధించడాన్ని ఏళ్ల తరబడి చూస్తూనే వస్తున్నాం. అయినా సరే మన రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతూనే ఉంది’ అని చెప్పారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ సుంకాలు వేయడంపై విమర్శలు చేసిన ఆయన.. ‘రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేసినా సరే, పాశ్చాత్య దేశాలతో సరైన సహకారం ఉండటం కష్టమే. ఎందుకంటే వెస్టర్న్ దేశాలు ఎప్పుడూ అలాగే చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో చూసుకుంటే.. ఆ దేశాలు నియోకలోనియల్ శక్తుల్లా కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటాయి’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో రష్యా-భారత్ మధ్య ప్రత్యేకమైన ప్రణాళిక ఉందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల భారత్‌కు ఎక్కువ లాభం ఉందని, కాబట్టి ఇప్పుడు సరఫరాను మార్చుకునే అవసరం ఇండియాకు లేదని అన్నారు.
ఇక ఈ ఏడాది చివర్లో భారత్‌లో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పర్యటిస్తారని బబుష్కిన్ తెలిపారు. ఆ సమయంలో ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయన్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియాలో స్థిరత్వం కోసం రష్యా-ఇండియా-చైనా (ఆర్ఐసీ) కూటమి సహకరించుకోవడం చాలా ముఖ్యమని బబుష్కిన్ అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా ఈ మూడు దేశాలు కలిస్తే వాటి ప్రాముఖ్యతను కాపాడుకోగలగుతామని పేర్కొన్నారు.






