Republic Day Celebrations: ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్స్ ఇవే!

by Dishanational2 |
Republic Day Celebrations: ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్స్ ఇవే!
X

దిశ, నేషనల్ బ్యూరో: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్యపథ్ సిద్ధమవుతోంది. సెలబ్రేషన్స్‌కు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సుమారు 77,000 మందికి ఆతిథ్యం ఇచ్చేలా వేదికను రూపొందించారు. ఇందులో 42000 సీట్లు సాధారణ ప్రజలకు కేటాయించారు. వేడుకల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీలో 14,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. అంతేగాక సైనిక ప్రదర్శలను నిర్వహించేందుకు భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు సన్నద్దమయ్యాయి. జనవరి 26న(శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుంచి కర్తవ్యపథ్ వరకు పరేడ్ జరగనుంది. ఈ ఏడాది జరిగే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

పూర్తిగా మహిళలతోనే పరేడ్

ఢిల్లీ పోలీసులు 1950 నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగమవుతుండగా.. ఈ సారి మాత్రం పూర్తిగా మహిళలతోనే పరేడ్ నిర్వహించనున్నారు. ఈ బృందానికి నార్త్ జిల్లా అదనపు డీసీపీ శ్వేతా కే సుగతన్ నాయకత్వం వహించనున్నది. దీనికోసం 350 మహిళా సిబ్బందిని ఎంపిక చేశారు. కిరణ్ బేడీ తర్వాత ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన రెండో ఐపీఎస్ ఆఫీసర్‌గా సుగతన్ నిలవనున్నారు. అంతకుముందు మేజర్ జనరల్ సుమిత్ మెహతా మాట్లాడుతూ..గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొత్తం మహిళా ట్రై-సర్వీసెస్ గ్రూప్ మొదటి సారి పాల్గొంటుందని చెప్పారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్క్వాడ్రన్ లీడర్ సుమితా యాదవ్ ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటారు. ఆమె గతేడాది జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రెంచ్ బాస్టిల్ డే పరేడ్‌లోనూ కవాతు చేయడం గమనార్హం.

కవాతులో ఫ్రెంచ్ బృందం: అలరించనున్న రఫేల్ యుద్ధ విమానాలు

రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ హాజరుకానున్న నేపథ్యంలో ఆ దేశ బృందం సైతం కవాతులో పాల్గొననుంది. ఫ్రెంచ్‌కు చెందిన 95 మంది సభ్యుల కవాతు గ్రూప్, 33 మందితో కూడిన బ్యాండ్ కంటెంజెంట్, రెండు రఫేల్ యుద్ధ విమానాలు, అలాగే ఎయిర్‌బస్ ఏ330 మల్టీ రోల్ ట్యాంకర్ రవాణా విమానం కూడా వేడుకల్లో అలరించనున్నాయి. కాగా, గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఆరో ఫ్రెంచ్ అధ్యక్షుడిగా మాక్రాన్ నిలవనున్నారు. మరోవైపు ఫ్రెంచ్ సైనిక బృందంలో ఆరుగురు భారతీయులు భాగమైనట్టు అధికారులు తెలిపారు.

చీరల ప్రదర్శన

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన చీరలను ప్రదర్శనల్లో ఉంచనుంది. కర్తవ్య్ పథ్ లో కూర్చునే ప్రేక్షకుల వెనుక వీటిని ప్రదర్శిస్తున్నారు. సుమారు 1900 చీరలను చెక్ ఫ్రేమ్‌లపై సుందరంగా అలంకరించారు. ప్రతి చీరకూ క్యూ ఆర్ కోడ్ అమర్చారు. దీనిని స్కాన్ చేయడం ద్వారా చీర నేసే విధానం, ఎంబ్రాయిడరీ పద్దతులను తెలుసుకోగలుగుతారు. అంతేగాక భారతదేశంలోని మహిళలు, నేత కార్మికుల గుర్తుగా 150 ఏళ్ల నాటి చీరను ఏర్పాటు చేసినట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కృత్రిమ మేధస్సు (ఏఐ) విశిష్టత

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో వివిధ రంగాలలో ఏఐ పాత్రను తెలియజేసేందుకు ఓ పట్టికను ప్రదర్శించనుంది. ఇందులో ఎలక్ట్రానిక్ తయారీకి ఉపయోగించే సెమీకండక్టర్ చిప్‌లు డిస్‌ప్లేలో ఉంచారు. అంతేగాక లాజిస్టిక్స్, ఇతర రంగాల నిర్వహణలోనూ ఏఐ పాత్రను చూపెట్టనున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్-3

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన పట్టికను గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం, ల్యాండింగ్‌ విజయవంతం వంటి వివరాలను పొందుపర్చారు. ఇది ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

13,000 మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానం!

వివిధ రంగాల్లో ప్రముఖులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సహా సుమారు 13,000 మంది ప్రత్యేక అతిథులను పరేడ్‌ను వీక్షించడానికి అధికారులు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, పీఎం కృషి సించాయీ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటి వివిధ ప్రభుత్వ పథకాల్లో రాణించిన వ్యక్తులు ప్రత్యేక అతిథులుగా ఉండనున్నారు.

Next Story

Most Viewed

    null