దళారుల దోపిడీ ఆగేనా.. నామమాత్రంగా అధికారుల తనిఖీలు

by Anjali |
దళారుల దోపిడీ ఆగేనా.. నామమాత్రంగా అధికారుల తనిఖీలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: వర్షాకాలం ముంచుకొస్తుండడంతో వ్యాపారులు కాటన్ సీడ్స్ తో పెద్ద మొత్తాలలో వ్యాపారం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పత్తి ,విత్తనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటూ వస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 40 సంవత్సరాలుగా పత్తి విత్తనాల ఉత్పత్తి, పత్తి ఉత్పత్తి జోరుగా సాగుతోంది. భూత్పూరు, గద్వాల కేంద్రాలుగా పత్తి ఉత్పత్తి జోరుగా సాగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం తదితర రాష్ట్రాలలోనూ ఇక్కడ ఉత్పత్తి అయ్యే విత్తనాలు, పత్తికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ తయారు అయ్యే విత్తనాలు , పత్తి కొనుగోలు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతుండడంతో పత్తి, విత్తనాల ఉత్పత్తిదారులు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసినా దళారులు రంగ ప్రవేశం చేసి అక్రమార్గాలలో విత్తనాలను విక్రయిస్తున్నారు. అధికారులచే ధ్రువీకరించబడని నకిలీ విత్తనాలను కొన్ని కొన్ని చోట్ల తక్కువ ధరలకే విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్నారు.

నామమాత్రంగా తనిఖీలు..

ప్రతి ఏటా భూత్పూర్, గద్వాల కేంద్రంగా నకిలీ విత్తనాల వ్యాపారాలు జోరుగా సాగుతూ వస్తోంది. వ్యవసాయ, పోలీసు అధికారులతో కలిసి ఏర్పడే తనిఖీ బృందాలు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా రైతులు అధికారుల ధ్రువీకరణ లేని విత్తనాలను రైతులు కొనుగోలు చేసి మోసపోతున్నారు. దిగుబడి సక్రమంగా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

వస్తే 50 శాతం.. లేకుంటే పూర్తి నష్టం..

నకిలీ పత్తి విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఉంటాయని అధికారులు విస్తృత ప్రచారం చేసినా దళారులు నిజమైన విత్తనాలుగా చూపుతూ రైతులకు విక్రయిస్తూ వస్తున్నారు. ఈ విత్తనాలను వేయడం ద్వారా వస్తే 50 శాతం దిగుబడి, లేదంటే పూర్తిగా దిగుబడి లేకపోవడంతో రైతులు నష్టపోవలసిన పరిస్థితులు నెలకొంటున్నాయి

రైతులు రసీదు తీసుకోవాల్సిందే..

రైతులు కాటన్ బ్యాగులలో విక్రయించే సీడును ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు అని, అధికారులచే ధ్రువీకరించబడి, లాట్ నంబర్ ఉన్న పత్తి విత్తనాల బ్యాగులను కొనుగోలు చేయాలని సంబంధిత వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా వ్యాపారుల నుంచి రసీదు తీసుకొని పూర్తి దిగుబడి వచ్చేవరకు దాచుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరము మరింత విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed