Collateral Free Loan : రైతులకు తాకట్టు లేకుండా రూ.2 లక్షల లోన్.. కొత్త ఏడాది నుంచి అమల్లోకి

by Hajipasha |   ( Updated:2024-12-14 10:04:27.0  )
Collateral Free Loan :  రైతులకు తాకట్టు లేకుండా రూ.2 లక్షల లోన్.. కొత్త ఏడాది నుంచి అమల్లోకి
X

దిశ, నేషనల్ బ్యూరో : నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ వినిపించింది. వ్యవసాయం కోసం తాకట్టు లేకుండా(collateral free loan) మంజూరు చేసే బ్యాంకు లోన్ లిమిట్‌ను పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి తాకట్టు లేకుండా రైతులకు రూ.1.60 లక్షల దాకా లోన్‌ను బ్యాంకులు మంజూరు చేస్తుండగా.. ఆ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈమేరకు మార్చిన నిబంధనలు 2025 సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండానే రైతులకు బ్యాంకులు లోన్స్(Agricultural Loan) మంజూరు చేయాలని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిబంధన అమలుకావడం లేదు. దీంతో చాలావరకు రైతులు పెట్టుబడి అవసరాల కోసం ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. రుణ సదుపాయాల్ని మెరుగుపరిస్తే దేశంలోని చిన్న, సన్నకారు రైతుల్లో 86 శాతం మందికి లబ్ధి చేకూరుతుందని ఇటీవలే కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా, తాకట్టు లేకుండా రైతులకు మంజూరు చేసే లోన్ లిమిట్ 2004లో కేవలం రూ.10వేలే. దాన్నే క్రమంగా పెంచుతూ.. ప్రస్తుతమున్న రూ.2 లక్షల స్థాయికి చేర్చారు.

Advertisement

Next Story