అహ్మదాబాద్‌లో రేవ్ పార్టీ కలకలం..? వేడుకల్లో విదేశీ మద్యం, హుక్కా విందు

by Ramesh Naini |

గుజరాత్‌ రాజధానిలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. అహ్మదాబాద్‌లో సంపన్న వర్గాల విలాసాలకు కేంద్రంగా మారిన ఒక హైప్రొఫైల్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

అహ్మదాబాద్‌లో రేవ్ పార్టీ కలకలం..? వేడుకల్లో విదేశీ మద్యం, హుక్కా విందు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌ రాజధానిలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. అహ్మదాబాద్‌లో సంపన్న వర్గాల విలాసాలకు కేంద్రంగా మారిన ఒక హైప్రొఫైల్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఒక ప్రముఖ జంటకు చెందిన 25వ వివాహ వార్షికోత్సవ వేడుక (సిల్వర్ జూబ్లీ) కాస్తా చట్టవిరుద్ధమైన మద్యం, హుక్కా పార్టీగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ ఘటనలో నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, బిల్డర్లు, వ్యాపారవేత్తలతో సహా మొత్తం 81 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర శివార్లలోని 'నిర్వాణ గ్రీన్స్ వీకెండ్ హోమ్స్'లో బుధవారం రాత్రి ఈ వేడుక జరిగింది. పక్కా సమాచారంతో సనంద్ పోలీసులు దాడి చేసిన సమయంలో అక్కడ విదేశీ మద్యం ఏరులై పారుతోంది. మొత్తం 11 ప్రత్యేక టేబుళ్లపై కేక్ కటింగ్స్, విలాసవంతమైన విందుతో పాటు హుక్కా పైపులు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ఎంట్రీతో పార్టీలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సీజ్ చేసిన సొత్తు రూ. 3 కోట్లు

ఈ దాడిలో పోలీసులు భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో విదేశీ మద్యం సీసాలు, 10కి పైగా హుక్కా పైపులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి వచ్చిన ప్రముఖులకు చెందిన 20కి పైగా ఖరీదైన లగ్జరీ కార్లు.. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ. 3 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న 81 మందిలో 43 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారు. పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం 35 నుంచి 45 ఏళ్ల వయస్సు గలవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిబంధనల ప్రకారం వీరికి నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించివేశారు. అయితే, వీరంతా నగరంలోని పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వారు కావడంతో బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్ వద్ద భారీ హైడ్రామా చోటు చేసుకున్నట్లు సమాచారం.

పోలీసుల సీరియస్ యాక్షన్

గుజరాత్‌లో మద్యపాన నిషేధం కఠినంగా అమలులో ఉన్న నేపథ్యంలో, ఈ స్థాయిలో మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సనంద్ పరిసరాల్లోని ప్రైవేట్ రిసార్టులు, వీకెండ్ హోమ్స్‌లో జరుగుతున్న ఇలాంటి అక్రమ పార్టీలపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అవలంబిస్తామని సనంద్ పోలీసులు హెచ్చరించారు. నిందితులపై ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Next Story