Rajasthan cm: రాజస్థాన్ సీఎంకు బెదిరింపులు.. చంపుతామని జైలు నుంచే వార్నింగ్ ఇచ్చిన ఖైదీ

by B.Srinivas |   (  Updated:2025-02-22 14:31:50  IST  )

రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకు హత్యా బెదిరింపులు ఎదురయ్యాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ జైలు నుంచే ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించారు.

Rajasthan cm: రాజస్థాన్ సీఎంకు బెదిరింపులు.. చంపుతామని జైలు నుంచే వార్నింగ్ ఇచ్చిన ఖైదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ (Bajan lal sharma)కు హత్యా బెదిరింపులు ఎదురయ్యాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ జైలు నుంచే ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించారు. శుక్రవారం అర్దరాత్రి రాష్ట్ర రాజధాని జైపూర్‌ (Jaipur)లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌ (Police control Room)కు ఫోన్ చేసి సీఎంను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి కాల్ చేసిన వ్యక్తిని దౌసా సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీ రింకు (Rinku)గా గుర్తించారు. లైంగిక దాడి కేసులో ఆయన జీవిత ఖైదు అనుభవిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం జైలులోనూ సోదాలు చేపట్టి ఓ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు దౌసా పోలీస్ ఉన్నతాధికారి గురు శరణ్ తెలిపారు.

నిందితుడు పది నిమిషాల వ్యవధిలోనే రెండు కాల్స్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి జవహర్ సింగ్ బేధం స్పందించారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేయాలని జైళ్ల శాఖ అధికారులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, గత ఏడు నెలల్లో దౌసా జైలు నుంచి సీఎంకు బెదిరింపు కాల్ రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సీఎం కార్యాలయం దగ్గర భద్రతను పెంచారు.

Next Story