అరుణ్ జైట్లీ నన్ను బెదిరించారన్న రాహుల్ గాంధీ.. తప్పుడు వ్యాఖ్యలన్న కుమారుడు

by Phanindra |

రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో అరుణ్ జైట్లీ తనను బెదిరించారని రాహుల్ గాంధీ అన్నారు. ఇవన్నీ తప్పుడు వ్యాఖ్యలేనని రోహన్ జైట్లీ చెప్పారు.

అరుణ్ జైట్లీ నన్ను బెదిరించారన్న రాహుల్ గాంధీ.. తప్పుడు వ్యాఖ్యలన్న కుమారుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో వ్యవసాయ చట్టాలపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. గతంలో మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనను బెదిరించారని చెప్పారు.

‘నేను వ్యవసాయ చట్టాలపై పోరాడుతున్నప్పుడు అరుణ్ జైట్లీని నన్ను బెదిరించడానికి పంపించారు. ఇలాగే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, వ్యవసాయ బిల్లలుపై పోరాడితే.. మీకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు. నేను ఆయన వైపు సూటిగా చూసి మీరెవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియట్లేదు అని చెప్పా’ అని రాహుల్ తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ స్పందించారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న రోహన్.. ‘మరణించిన మా తండ్రి తనను బెదిరించారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన 2019లోనే మరణించారు. వ్యవసాయ చట్టాలు 2020లో ప్రవేశపెట్టారు. అయినా మా నాన్న ఎవరినీ బెదిరించే రకం కాదు.

గతంలో మనోహర్ పారికర్‌ విషయంలో కూడా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన చివరి రోజులపై రాజకీయం చేయాలనుకున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. దయచేసి మరణించిన వారిని ప్రశాంతంగా ఉండనివ్వండి’ అని రోహన్ సూచించారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కూడా రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

‘2020 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నప్పుడు అరుణ్ జైట్లీ తనను బెదిరించారని రాహుల్ అంటున్నారు. అరుణ్ జైట్లీ 2019 ఆగస్టు 24న చనిపోయారు. 2020 జూన్ 3న వ్యవసాయ చట్టాల డ్రాఫ్ట్‌ బిల్లు కేబినెట్ ముందుకొచ్చింది. ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌లో ఈ చట్టాలు అమలయ్యాయి’ అని మాలవీయ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

Next Story