Raghav Chadha: ‘ధురంధర్‌’ డైలాగ్‌తో ఆప్‌పై రాఘవ్‌ చద్దా వార్నింగ్!

by Ramesh Naini |   (  Updated:2026-04-04 10:38:56  IST  )

రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తనను ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించడంపై ఎంపీ రాఘవ్‌ చద్దా మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు.

Raghav Chadha: ‘ధురంధర్‌’ డైలాగ్‌తో ఆప్‌పై రాఘవ్‌ చద్దా వార్నింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తనను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలగించడంపై ఎంపీ రాఘవ్‌ చద్దా మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. పార్లమెంట్‌లో తన గొంతు నొక్కేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపిస్తూ, తనపై ఆప్ నేతలు చేసిన ఆరోపణలను శనివారం ఎక్స్ (X) వేదికగా విడుదల చేసిన వీడియోలో ఆయన తిప్పికొట్టారు.

ఆప్ ఆరోపణలకు రాఘవ్‌ సమాధానం..

విపక్షాల ఆందోళనల్లో తాను పాల్గొనలేదన్నది పచ్చి అబద్ధమని, పార్లమెంట్ సీసీటీవీ ఫుటేజీ చూస్తే వాస్తవాలు తెలుస్తాయని సవాల్ చేశారు. సీఈసీ అభిశంసన తీర్మానంపై సంతకం చేయాలని తనను అసలు ఎవరూ అడగలేదన్నారు. 10 మంది ఆప్ ఎంపీల్లో 6-7 మంది ఆ తీర్మానంపై సంతకం చేయనప్పుడు, తనను మాత్రమే ఎందుకు టార్గెట్‌గా చేసుకున్నారని ప్రశ్నించారు. పంజాబ్ నీటి సమస్య, ఢిల్లీ కాలుష్యం, నిరుద్యోగం వంటి అంశాలపై తాను పోరాడుతున్నానని.. సభలో అరవడం, ఆస్తులు ధ్వంసం చేయడం తన విధానం కాదన్నారు. కాగా, రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ మిట్టల్‌ను ఆప్ నియమించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని బట్టబయలు చేస్తానని స్పష్టం చేసిన చద్దా.. 'ధురంధర్' సినిమాలోని ‘గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకరంగా మారాను’ అనే డైలాగ్‌తో ఆప్ అధిష్టానానికి వార్నింగ్ పంపారు.

Next Story