భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

by Ajay Maddhiboyina |

అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ యుద్దంపై తీసుకున్న వైఖరి, భౌగోళిక రాజకీయ సంక్షోభంపై ఇరు దేశాల నాయకులు చర్చించే అవకాశం ఉంది.

భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
X

- ఆహ్వానం పంపిన ప్రధాని మోడీ

- పుతిన్ అంగీకరించారని రష్యా మినిస్టర్ వెల్లడి

- ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత ఇదే తొలి పర్యటన

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ఇండియాలో పర్యటించనున్నారు. గతేడాది ప్రధాని మోడీ మాస్కో పర్యటన సందర్భంగా ఇండియాలో పర్యటించాలని పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన భారత్ పర్యటన ఖరారు అయినట్లు రష్యా వర్గాలు ధృవీకరించాయి. 2022లో ఉక్రెయిన్ యుద్దం మొదలైన తర్వాత పుతిన్ చేస్తున్న తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని, అయితే ఇప్పటి వరకు తేదీలు ఖరారు కాలేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. అధ్యక్షుడు పుతిన్ భారత ప్రభుత్వాధినేత నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించారని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ మూడో సారి తిరిగి ఎన్నికైన తర్వాత తన తొలి పర్యటనకు రష్యాను ఎంచుకున్నారు. ఇక ఇప్పుడు మా వంతు వచ్చిందని లావ్రోవ్ అన్నారు.

అమెరికాకు రెండో సారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ యుద్దంపై తీసుకున్న వైఖరి, భౌగోళిక రాజకీయ సంక్షోభంపై ఇరు దేశాల నాయకులు చర్చించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ వివాదంపై భారత్ ఇప్పటి వరకు తటస్థ వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. ఇది యుద్దం చేయాల్సిన యుగం కాదని పుతిన్‌కు ప్రధాని మోడీ పదే పదే చెప్పారు. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానాలకు భారత్ కూడా దూరంగా ఉంది. అంతే కాకుండా పుతిన్‌ను బహిరంగంగా విమర్శించడం మానేశారు. వాస్తవానికి 2024లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలవడానికి మాస్కో, కైవ్ రెండింటినీ సందర్శించిన అతి కొద్ది మంది నాయకుల్లో ప్రధాని మోడీ :కరు. బ్రిక్స్ సమ్మిట్ కోసం అక్టోబర్‌లో మోడీ రష్యాలోని కజాన్‌కు వెళ్లారు.

22వ రష్యా-భారత్ శిఖరాగ్ర సమావేశానికి మాస్కో వెళ్లిన సందర్భంగా ప్రధాని మోడీ, పుతిన్‌ల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షించింది. మోడీ, పుతిన్ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న వీడియోలు, గోల్ఫ్ కార్ట్‌లో తన నివాసాన్నిచూపిస్తూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని అంగీకరించాయి.

Next Story