Russia-Ukraine: షరతులు లేకుండా ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు పుతిన్ ప్రతిపాదన

by S Gopi |

ప్రధానంగా ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఈ చర్చలను ప్రారంభించాలనేదే తమ ప్రతిపాదన అని పుతిన్ స్పష్టం చేశారు.

Russia-Ukraine: షరతులు లేకుండా ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు పుతిన్ ప్రతిపాదన
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే 15న ఇస్తాంబుల్‌లో ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇది శాశ్వత శాంతిని తీసుకురావాలని, యుద్ధానికి మూల కారణాలను తొలగించే లక్ష్యంతో ఉండాలని ఆయన అన్నారు. 2022, ఫిబ్రవరిలో పుతిన్ వేలాది మంది సైనికులను ఉక్రెయిన్‌కి పంపి యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ పరిణామంతో 1962 క్యూబన్ క్షిపణి సంక్షోభం తర్వాత రష్యా, పశ్చిమ దేశాల మధ్య అత్యంత తీవ్రమైన ఘర్షణకు దారితీసింది. ఇస్తాంబుల్‌లో ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలకు ప్రతిపాదించడం దీర్ఘకాలిక, శాశ్వత శాంతి పునరుద్ధరణను సాధించే దిశగా జరగాలని, తిరిగి ఆయుధాలు సమకూర్చుకునే విరామం కాకూడదని అన్నారు. ప్రధానంగా ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఈ చర్చలను ప్రారంభించాలనేదే తమ ప్రతిపాదన అని ఆదివారం ప్రకటనలో పుతిన్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఉక్రెయిన్ అధికారులకు తిరిగి చర్చలు ప్రారంభించేందుకు సమాచారం ఇచ్చామన్నారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ దేశాల నుంచి పదేపదే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఘర్షణలు తగ్గించేందుకు పుతిన్ ముందుకొచ్చారు. దీనికి సంబంధించి టర్కీ అధ్యక్షుడు తయ్యుప్ ఎర్డొగన్‌తో మాట్లాడుతానని పుతిన్ చెప్పారు. ఈ చర్చ కాల్పుల విరమణకు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. వారన్నట్టే మా ప్రతిపాదన ముందుపెట్టాం. నిర్ణయం ఇప్పుడు ఉక్రెయిన్ అధికారులు, వారి క్యూరేటర్ల వద్ద ఉంది. అయితే, దీన్ని వారు సొంత ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ లక్ష్యాలను నెరవేర్చేలా చూస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఇప్పటికే పలుమార్లు రష్యా కాల్పుల విరమణను ప్రకటించామని పుతిన్ అన్నారు. విక్టరీ డేతో పాటు ఈస్టర్ సందర్భంగా కాల్పుల విరమణను ప్రస్తావించారు. అయినప్పటికీ ఉక్రెయిన్ దీన్ని ఉల్లంఘించాయని, వాటిని తమ సైన్యం గట్టిగానే ఎదుర్కొందని తెలిపారు. ఈసారి జరిగే చర్చల్లో కాల్పుల విరమణకు కీలక డిమాండ్ల విషయంలో పుతిన్ వెనక్కి తగ్గట్లేదు. నాటోలో సభ్యత్వం ఆలోచనలను ఉక్రెయిన్ విరమించుకోవాలని, రష్యా ఇప్పటికే ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వారి బలగాలు వెనక్కి వెళ్లాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2022, ఫిబ్రవరి నాటి ఇరు దేశాల ముసాయిదా ఒప్పందాన్ని ఉక్రెయిన్ వదులుందన్నారు. అప్పటి సంధి చర్చల నుంచి వైదొలగడం ఉక్రెయిన్ నిర్ణయమేనని ప్రస్తావించారు.

Next Story