Putin: పుతిన్, జెలెన్ స్కీ మధ్య ప్రత్యక్ష చర్చలు !

by B.Srinivas |   (  Updated:2025-08-19 17:13:15  IST  )

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం జరగనుంది. ఇరు దేశాల అధ్యక్షులు ప్రత్యక్షంగా చర్చలు జరపనున్నారు.

Putin: పుతిన్, జెలెన్ స్కీ మధ్య ప్రత్యక్ష చర్చలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం జరగనుంది. ఇరు దేశాల అధ్యక్షులు ప్రత్యక్షంగా చర్చలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుతో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, యూరోపియన్ యూనియన్ నాయకులు భేటీ అయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్దంపై డిస్కస్ చేశారు. ఈ టైంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ట్రంప్ ఫోన్‌లో సంభాషించారు. ఇద్దరు నేతలు శాంతి శిఖరాగ్ర సమావేశానికి మద్దతిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ వెల్లడించారు. మాస్కోలో క్రెమ్లిన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చల ఆలోచనకు పుతిన్ సైతం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీంతో త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్షంగా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పదిహేను రోజుల్లోనూ ఈ సమావేశం ఉండనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇది కీలకమైన అడుగు అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సమావేశం ఎక్కడ జరుగుతుందో త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఉక్రెయిన్‌తో సమావేశానికి రష్యా అధ్యక్షుడిని ఒప్పించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అన్నారు.

ఉక్రెయిన్‌కు సాయం: ట్రంప్

ప్రస్తుత వివాదం ముగిసిన తర్వాత రష్యా మళ్లీ ఉక్రెయిన్ పై దాడి చేయకుండా ఉక్రెయిన్ భద్రతను నిర్ధారించడానికి అమెరికా సాయం చేస్తుందని ట్రంప్ చెప్పారు. యుద్ధాన్ని ముగించే ఏ ఒప్పందంలోనైనా ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇవ్వడానికి యూఎస్ తోడ్పడుతుందని తెలిపారు. దీనిపై అమెరికా, యూరోపియన్ దేశాలు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఈ హామీని కీలక ముందడుగుగా జెలెన్ స్కీ ప్రశంసించారు. పది రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపారు. 90 బిలియన్ల విలువైన యూఎస్ ఆయుధాల కొనుగోలుకు ఉక్రెయిన్ ముందుకొచ్చిందని చెప్పారు.

పుతిన్ జెలెన్ స్కీ భేటీకి సన్నాహాలు చేస్తున్నాం: మార్కో రూబియో

పుతిన్, జెలెన్ స్కీల మధ్య చారిత్రాత్మక సమావేశానికి ట్రంప్ పరిపాలనా విభాగం సన్నాహాలు చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ సమావేశం విజయవంతమైతే, దాని తర్వాత ట్రంప్, పుతిన్, జెలెన్ స్కీ మధ్య త్రైపాక్షిక సమావేశం జరగొచ్చని పేర్కొన్నారు. అయితే వారిద్దరి మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందని స్పష్టంగా చెప్పలేనని, కానీ ఇదొక కీలక పరిణామంగా భావించొచ్చని తెలిపారు.

Next Story